కలం, నిర్మల్ : ఢిల్లీలో నీట్ పరీక్ష అంశంపై నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం రాత్రి ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy) మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తరఫున గొంతెత్తిన ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు విరుద్ధమని విమర్శించారు.
నీట్ పరీక్షకు సంబంధించిన అంశంపై విద్యార్థులు, యువత ఆందోళన చెందుతున్న సమయంలో వారి సమస్యలను ప్రస్తావించిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతును అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే భిన్నాభిప్రాయాలను గౌరవించాలని, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడకూడదని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

