కలం, స్పోర్ట్స్ : గ్లోబల్ చెస్ లీగ్ సీజన్-4కు రంగం సిద్ధమైంది. బెంగళూరులో శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ లీగ్‌లో గత సీజన్ ఛాంపియన్ ఆల్పైన్ ఏపీఎల్ పైపర్స్ (Alpine APL Pipers) మరోసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రపంచ దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్సెన్ (Magnus Carlsen) జట్టులో ఉండటంతో పైపర్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సీజన్లో అద్భుత ప్రదర్శనతో టైటిల్ దక్కించుకున్న పైపర్స్.. ఈసారి కూడా బలమైన జట్టుతో సిద్ధమైంది. ఐకాన్ ప్లేయర్‌గా కార్ల్‌సెన్‌తో పాటు అనిష్ గిరి, విదిత్ గుజరాతి జట్టులో ఉన్నారు. మహిళల విభాగంలో భారత స్టార్ ప్లేయర్లు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రాడిజీ ప్లేయర్‌గా వోలొదార్ ముర్జిన్ ఉండగా.. జట్టుకు ప్రఖ్యాత కోచ్ ప్రవీణ్ తిప్సే మార్గనిర్దేశనం చేయనున్నారు.
గత విజయం.. ఈసారి కొత్త సవాల్
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. గత విజయాన్ని చూసుకుని అతిగా నమ్మకంగా ఉండొద్దని కోచ్ ప్రవీణ్ తిప్సే ఆటగాళ్లకు సూచించారు. గత సీజన్లో సాధించిన విజయం, ఆటగాళ్ల రేటింగ్‌లు మాత్రమే ఈసారి గెలుపునకు హామీ ఇవ్వవని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యర్థుల బలాబలాలను అంచనా వేసేందుకు వారి ఇటీవలి ర్యాపిడ్ గేమ్‌లను పరిశీలించినట్లు తిప్సే తెలిపారు. ప్రతి ఆటగాడి బలహీనతలను గుర్తించి, వాటిపై ప్రత్యేకంగా సన్నద్ధత చేపట్టినట్లు వెల్లడించారు.
డిఫెండింగ్ ఛాంపియన్‌పై అందరి ఫోకస్
పైపర్స్కు మరో సవాలు కూడా ఎదురుకానుంది. గత సీజన్ ఛాంపియన్‌గా నిలిచిన కారణంగా ఈసారి ప్రతి ప్రత్యర్థి తమపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందని కోచ్ భావిస్తున్నారు. అందుకే అనవసరమైన మీడియా, ప్రచార కార్యక్రమాల కంటే ఆటగాళ్ల ప్రాక్టీస్, విశ్రాంతి, మ్యాచ్‌లపై పూర్తి ఏకాగ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని జట్టు నిర్ణయించింది.
తొలి లక్ష్యం టాప్-2
లీగ్ దశలో డబుల్ రౌండ్ రాబిన్ విధానంలో మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ ముగిసే సమయానికి టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. దీంతో పైపర్స్ తొలి లక్ష్యంగా టాప్-2లో స్థానం సంపాదించడాన్ని పెట్టుకుంది. కార్ల్సెన్ వంటి ప్రపంచస్థాయి ఆటగాడి రాకతో కాగితంపై అత్యంత బలమైన జట్లలో ఒకటిగా కనిపిస్తున్న పైపర్స్.. ఆ అంచనాలను ఇప్పుడు చెస్ బోర్డుపై కూడా నిజం చేయాల్సి ఉంది. గత సీజన్ విజయాన్ని పునరావృతం చేసి వరుసగా రెండో టైటిల్‌ను అందుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

