కలం, హనుమకొండ: నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (GWMC Commissioner) టి. వెంకన్న (Venkanna) అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షపు నీరు నిల్వ కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
తిరుమల బార్ జంక్షన్, ఎన్‌జీవోస్ రోడ్డు, ఎస్‌బీహెచ్ కాలనీ, రామకృష్ణ కాలనీ, కాకతీయ కాలనీ, బొంది వాగు, శివనగర్, మైసయ్యనగర్, సాయి గణేష్ నగర్, వడ్డేపల్లి చెరువు, 12 మోరీలు ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ విభాగానికి చెందిన మాన్‌సూన్ బృందాలతో సమన్వయం చేసుకుని నీటి నిల్వలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. చిన్న వీధుల్లోని డ్రైన్లలో నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చోట డీ-సిల్టింగ్ పనులు చేపట్టాలని, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రధాన రహదారులతో పాటు లింక్ రోడ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ తెలిపారు. డివైడర్ల మధ్య పేరుకుపోయిన చెత్త, ఆకులను వెంటనే తొలగించాలని, స్వీపింగ్ యంత్రాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షణ పెంచాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ వెంకన్న స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ముఖ్య ఆరోగ్యాధికారి డా. రాజారెడ్డి, ఎంహెచ్‌వో డా. రాజేష్, శానిటరీ సూపర్వైజర్ గోల్కొండ శ్రీను తదితర అధికారులు పాల్గొన్నారు.

