కలం, వెబ్ డెస్క్ : నీట్ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టిన విద్యార్థులు, క్రాకోచ్ జనతా పార్టీ నేతలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) ఖండించారు. విద్యావ్యవస్థపై, పరీక్షలపై తమకు జరుగుతున్న అన్యాయం గురించి న్యాయమైన ప్రశ్నలు అడిగేందుకు వచ్చిన విద్యార్థులపై లాఠీఛార్జీ చేయిస్తారా? అంటూ కేంద్రంపై ఫైర్ అయ్యారు.
దేశంలో పరీక్షల వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇప్పటివరకు దేశంలో ఏకంగా 152 పేపర్ లీకులు జరిగాయని, దీనివల్ల దాదాపు 7.5 కోట్ల మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద కుంభకోణాలు జరుగుతున్నా, కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
ముఖ్యంగా పేపర్ లీకేజీలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై వరుస ఆరోపణలు వస్తున్నా ప్రధాని మోదీ ఆయనకు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. పేపర్ లీక్ చేసిన అసలు నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను మాత్రం రోడ్లపై ఈడ్చుకెళ్లి కొట్టారని ఆరోపించారు. ఈ క్రమంలోనే దేశ చరిత్రలోనే యువతను ఇంతలా చిన్నచూపు చూసిన ప్రధాని మరొకరు లేరని ప్రధాని మోదీపై మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా తన నిద్రను వీడి, యువత ఆక్రందనలను ఆలకించి, తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

