కలం, ఖమ్మం బ్యూరో : వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానించి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం అంజనా పురంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అత్యంత ఆధునికంగా నిర్మించిన గోద్రెజ్ సమీకృత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ నాదిర్ బి. గోద్రెజ్లతో కలిసి ఆయన ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, దేశంలో వంటనూనెల దిగుమతులు తగ్గించి స్వయం సమృద్ధి సాధించడంలో ఆయిల్ పామ్ సాగు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, సాగు చేసే రైతులకు నాలుగేళ్ల కాలంలో ఎకరాకు రూ. 52 వేల వరకు ప్రోత్సాహకం అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కొణిజెర్లను ప్రధాన పారిశ్రామిక మండలంగా తీర్చిదిద్దుతామని, పత్తి, మిర్చి, వరి ఆధారిత పరిశ్రమలను కూడా ఖమ్మంలో నెలకొల్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మలేషియా భాగస్వామ్యంతో దేశంలోనే తొలి ఆధునిక ‘సీడ్ గార్డెన్’ను ఖమ్మంలో ఏర్పాటు చేస్తుండటం గర్వకారణమన్నారు. దీనివల్ల ఇకపై విత్తనాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రతి 10 వేల ఎకరాల సాగు ఉన్న చోట ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని, త్వరలోనే రాష్ట్రంలో మరో ఆరు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
113 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ సమీకృత ప్రాజెక్టు (మిల్లింగ్ యూనిట్, రిఫైనరీ, సీడ్ గార్డెన్) ద్వారా స్థానిక యువతకు 700 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫ్యాక్టరీ నియామకాల్లో స్థానిక యువతకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, సీపీ సునీల్ దత్, గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎండీ సునీల్ కటారియా తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

