కలం, నిజామాబాద్ బ్యూరో : అంకాపూర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి (MLA Rakesh Reddy) మద్దతు తెలిపేందుకు బయలుదేరిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana)ను సోమవారం పోలీసులు ఇంటి వద్దే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అనవసర వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గత రెండున్నర సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై తాము ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధిని వివరించే ధైర్యం కాంగ్రెస్ నాయకత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలు చెల్లించకపోవడంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, మరోవైపు ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేస్తోందని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని పేర్కొన్నారు.
Read Also: మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారు: ఖర్గే
Follow Us On: Instagram

