సీడ్ ప్రొడ్యూసర్స్‌పై కేసులు నమోదు చేయాలి: సీపీఎం

కలం, కరీంనగర్: జిల్లా వ్యాప్తంగా అన్నదాతలను ఆర్థికంగా మోసం చేస్తూ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న జిల్లాలోని సీడ్ ప్రొడ్యూసర్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి (Milkuri Vasudeva Reddy) డిమాండ్ చేశారు. రైతాంగానికి న్యాయంగా ఒప్పందం ప్రకారం డబ్బులు ఇప్పించాలన్నారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయం ముకుంద లాల్ మిశ్రా భవన్ లో సీపీఎం జిల్లా (Karimnagar CPM) కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను వాసుదేవరెడ్డి ప్రకటించారు.

అలా చేయడం రైతులను మోసం చేయడమే..

ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పెద్ద ఎత్తున రైతులు వరి విత్తనాలు ఉత్పత్తి చేస్తారని, ఉత్పత్తి చేసిన విత్తనాలను సీడు ప్లాంట్లకు విక్రయిస్తారని తెలిపారు. సీడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ 2025 నవంబర్ లో యాసంగి సీజన్ గాను ధరలు నిర్ణయించి రైతాంగంతో అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పారు. దీంతో రైతులు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి పంటలు పండించి అగ్రిమెంట్ చేసుకున్న ఒప్పందం మేరకు ఆయా సీడ్ ప్లాంట్ లో విక్రయించారన్నారు. రైతుల కష్టం సీడ్ ప్లాంట్లకు చేరిన తర్వాత సీడ్ ప్లాంట్ యజమానులు ధరలు తగ్గిస్తూ నిర్ణయం చేయడం రైతులను మోసం చేయడమే అవుతుందని విమర్శించారు.

అగ్రిమెంట్‌ను తుంగలో తొక్కారు..

2025 నవంబర్ లో చేసిన అగ్రిమెంట్ ను తుంగలో తొక్కి 2026 మే నెలలో రైతులను దోచుకునే మరో అగ్రిమెంటు రాసుకున్నారని ఆయన గుర్తు చేశారు. పంట పండించక ముందు ఒక అగ్రిమెంటు.. పండించిన తర్వాత సీడు ప్లాంట్లకు ధాన్యం తరలివెళ్లిన తర్వాత మరో అగ్రిమెంటు తయారుచేసి రైతుల నోట్లో మట్టి కొట్టే సీడ్ ప్లాంట్ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏటా రైతుల నుండి తరుగు పేరుతో తూకం పేరుతో, సంచి బరువు పేరుతో ఒక్కో బస్తాకు రెండున్నర కిలోలు కోతలు విధిస్తూ కోట్ల రూపాయలు అక్రమంగా గడించి బడా బాబులుగా చలామణి అవుతున్న సీడ్ ప్లాంట్ యజమానులపై నాన్ బెయిలబుల్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

రైతులను బెదిరిస్తున్నారు..

2025 నవంబర్‌లో ఉన్న అసోసియేషన్ కమిటీ చేసిన తీర్మానాన్ని కాదని అసోసియేషన్ కమిటీ మారడంతో 2026 మేలో నూతన కమిటీ రైతులను నిలువునా దోపిడీ చేసే తీర్మానం చేసిందని వాసుదేవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో ఒప్పందాలు చేసుకొని పంట పండిన తర్వాత మిల్లుల్లో చేరిన తర్వాత ధరలు తగ్గించడం రైతుల గొంతు నొక్కడమే అవుతుందని అన్నారు.

ఒప్పందం ప్రకారం తనకు వరి ధాన్యం డబ్బులు చెల్లించాలని సీడ్ ప్లాంట్ యజమానులను రైతులు అడిగితే.. ‘తగ్గించి ఇస్తాం.. మీ ఇష్టం ఉంటే తీసుకోండి.. లేదంటే మీ ఇష్టం ఉన్నది చేసుకోండి’ అంటూ రైతులను సీడ్ ప్లాంట్ యజమానులు అవమాన పరుస్తూ బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. సీడ్ ప్లాంట్ల యజమానులపై జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. రైతాంగానికి న్యాయంగా ఒప్పందం మేరకు డబ్బులు ఇవ్వాలని.. లేని పక్షంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

తాగు, సాగునీరు అందించాలి..

జిల్లావ్యాప్తంగా కరువు పరిస్థితులు ఏర్పడ్డ నేపథ్యంలో సాగునీరు తాగునీరు అందించాలని వాసుదేవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాధనం లక్ష కోట్ల రూపాయలతో కట్టిన ఆనకట్టలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రజా అవసరాలకు ఎంత మాత్రం ఉపయోగపడకుండా కాంగ్రెస్ పార్టీ చోద్యం చూస్తుందన్నారు. కన్నెపల్లి నుండి అన్నారం బ్యారేజ్ కి నీటిని లిఫ్టు చేయడానికి అవకాశం ఉందన్నారు. కన్నెపల్లి దగ్గర ఉండే నీటిని అన్నారం బ్యారేజ్ దగ్గర లిఫ్ట్ చేయగలిగితే అక్కడినుండి మిగతా ప్రాజెక్టులకు నీళ్లు చేరుతాయని తద్వారా జిల్లా ప్రజల సాగునీరు, తాగునీరుకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు.

వర్షాభావ పరిస్థితులు నేపథ్యంలో పంటలు వేసిన రైతులు వర్షాలు లేక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలక ప్రతిపక్ష పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నీటిని పొదుపుగా వాడుకొని ప్రజా అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ పిల్లర్ కూలిందని పదేపదే ప్రస్తావిస్తున్నారే తప్ప అక్కడ ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి అని చూడడం లేదన్నారు.

డబల్ బెడ్ రూములు పంచాలి..

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని.. లేని ఎడల అర్హులైన పేదలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆక్రమిస్తామని వాసుదేవరెడ్డి హెచ్చరించారు. 8 రకాల వరి వంగడాలకే బోనస్ చెల్లిస్తామని అధికారులు, ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో ఇతర రకాల నార్లు పోసిన రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వ్యవసాయ శాఖ గతంలో ప్రకటించిన 33 రకాల వరి వంగడాలకు బోనస్ యధావిధిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్బడి ముబ్బడిగా కరెంటు కోతలు చేస్తున్నారని బావుల కింద నాట్లు వేసిన రైతులు అరిగోస పడుతున్నారన్నారు. కరెంటు రాక నీళ్లు లేక దిక్కుతో స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారన్నారు.

పోరాటాలు చేస్తాం..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూ, శ్రామికవర్గ ప్రయోజనాలను దెబ్బతీస్తూ కొత్త చట్టాలు తెచ్చారని దుయ్యబట్టారు. రైతులకు నష్టం చేసే మూడవ రైతు డిస్కౌంను రద్దు చేయాలన్నారు. కూలీల పొట్ట గొట్టే వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దుచేసి, పాత చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా తయారుచేసి కార్మిక వర్గాన్ని మరింత కట్టు బానిసలు చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఆగస్టు చివరి వరకు గ్రామాల్లో సభలు, సమావేశాలు, చర్చలు, సదస్సులు, నిర్వహిస్తామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై నికరమైన పోరాటాలు నిర్వహిస్తామన్నారు.

ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకట్ రెడ్డి, జి.బీమా సాహెబ్ జిల్లా కమిటీ సభ్యులు, ఉప్పునూటి శ్రీనివాస్, సుంకర సంపత్, ఎడ్ల రమేష్, జి రాజేశం, డి నరేష్ పటేల్, కోనేటి నాగమణి, కొప్పుల శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Read Also: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు విద్యాసంస్థలకు సెలవు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>