కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ‘సర్’ ప్రక్రియపై చాలామంది లీడర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే పది రోజులు సీరియస్‌గా ఉండాలని, నియోజకవర్గాలకే పరిమితం కావాలని పార్టీ లీడర్లకు సూచించారు. లేదంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ‘‘ఇప్పటి వరకు 52 నియోజకవర్గాల్లోనే ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలుగా ఉన్న లీడర్లు ‘సర్’ సమావేశాల్లో పాల్గొన్నారు.

మిగిలినచోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నాలుగైదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కనీసం ఒక్క సమావేశం కూడా పెట్టలేదు” అని సీరియస్ అయ్యారు. ‘సర్‌‌’పై ఆదివారం హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్‌ నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే పది రోజుల యాక్షన్ ప్లాన్‌ నిర్దేశించారు. ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దని.. కార్పొరేషన్ పదవులు, పార్టీలో పోస్టుల కోసం ప్రయత్నించొద్దని స్పష్టం చేశారు. అలాంటి వారికి అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వొద్దని చెప్పారు.

నేడు మంత్రుల సమావేశాలు

అన్ని జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రులు సోమవారం ‘సర్’పై స్థానిక పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహిస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన ప్రోగ్రెస్‌తో పాటు ఇకపై చేపట్టాల్సిన పనులపై ప్లానింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ‘‘కొన్నిచోట్ల ఎంపీలు ఇన్‌చార్జిలుగా ఉన్నందున ఢిల్లీలోని పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలి. ఇన్‌చార్జిలుగా ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటిదాకా 119 నియోజకవర్గాల్లో పార్టీ ఆధ్వర్యంలో ‘సర్’పై 489 సమావేశాలు జరిగాయి. ఈ ప్రక్రియ నత్తనడకన నడుస్తున్న నియోజకవర్గాల్లో ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు స్పందించాలి. కొందరు నాయకులు హైదరాబాద్‌లో కూర్చొని పని చేయడం లేదు. పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలి. రాబోయే పది రోజులూ ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లోనే పర్యటించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, కార్పొరేషన్ చైర్మన్లు, ‘సర్’పై నియమించిన పార్టీ ఇన్‌చార్జిలు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే” అని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరింత ఎక్కువ బాధ్యత తీసుకుని ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలను సమన్వయం చేయాలని సూచించారు.

బీఎల్ఏ రిపోర్టులే కీలకం

– పార్టీ పరంగా ‘సర్’ ఇన్‌చార్జిలుగా ఉన్నవారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. పార్టీ తరఫున బీఎల్‌ఏలుగా పని చేస్తున్న కేడర్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు.

– ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, చైర్‌పర్సన్లు బీఎల్‌ఓల రిపోర్టుల కంటే బీఎల్‌ఏల రిపోర్టులను పరిశీలించాలన్నారు. కేవలం బీఎల్‌ఓల రిపోర్టుల మీదనే ఆధారపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

– బీఎల్‌ఏ, బీఎల్‌ఓ రిపోర్టులను గాంధీభవన్ టీమ్ ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ‘సర్’ను ఇన్‌చార్జ్ మంత్రులు పర్యవేక్షించాలని, అన్నింటికీ వాళ్లదే బాధ్యతని గుర్తుచేశారు.

– ఈ నెల 30న మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని, అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని తెలిపారు.

– ప్రతి ఒక్కరూ ‘సర్’పై సీరియస్‌గా దృష్టి సారించాలని, బాగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు రాహుల్‌గాంధీని కలిసి ఫొటో దిగే అవకాశం కల్పిస్తామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>