కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో సర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరు సీరియస్ గా పనిచేయాలని కాంగ్రెస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) హెచ్చరించారు. 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో పని చేయాలని ఆదేశించారు. సర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారని.. దీనిని ఒక అవకాశంగా తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR)పై కాంగ్రెస్ నేతలతో ఆదివారం సీఎం రేవంత్ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేడర్ కు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ మీటింగ్‌కి డీప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్, ఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు, నియోజక వర్గ ఇన్ చార్జీలు, సర్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

వారికి రాహుల్ గాంధీతో ఫోటో దిగే అవకాశం

సర్ ప్రక్రియపై బాగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్ పై 489 సమావేశాలు జరిగాయని.. బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలని అన్నారు. కాంగ్రెస్ నేతలు చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని.. అలాంటి వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దని సీఎం ఆదేశించారు. రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు గాంధీభవన్‌కు రావొద్దని తేల్చి చెప్పారు. సర్ ప్రక్రియపై క్షేత్ర స్థాయిలో పనిచేయని ఇన్‌ఛార్జ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొందరు నాయకులు హైదరాబాద్‌లో కూర్చొని పనిచేయడం లేదని మండిపడ్డారు.

అలా చేస్తే కఠిన చర్యలు..

అన్ని జిల్లాల్లో సర్ ప్రక్రియపై సోమవారం 10 మంది ఇన్‌చార్జ్ మంత్రులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని సీఎం రేవంత్ తెలిపారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని సూచించారు. ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పార్టీ పరంగా సర్ ప్రక్రియ ఇన్‌చార్జీలుగా ఉన్న వారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, చైర్మన్లు బీఎల్‌ఓల రిపోర్టుల కంటే బీఎల్‌ఏల రిపోర్టులను పరిశీలించాలని.. బీఎల్‌ఓల రిపోర్టుల మీద మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

మహేశ్, భట్టి మరింత బాధ్యత తీసుకోవాలి..

పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్‌ఏలను పార్టీ నాయకులు సమర్థవంతంగా ఉపయోగించాలని సీఎం రేవంత్ సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్‌ఐఆర్‌కు నియమించిన పార్టీ ఇన్‌చార్జ్‌లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని స్పష్టం చేశారు. బీఎల్‌ఏ, బీఎల్‌ఓ రిపోర్టులను గాంధీభవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు. ఈ నెల 30వ తేదీన మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని.. అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లను సమన్వయం చేయాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>