కలం, ఖమ్మం బ్యూరో: ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో భద్రాద్రి క్షేత్రానికి మహర్దశ పట్టబోతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) స్పష్టం చేశారు. ఆదివారం భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం, ఆలయ పరిధిలో జరుగుతున్న వివిధ పునర్నిర్మాణ, అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. గత పాలకుల మాదిరిగా కాకుండా, ఈ ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా పనులను ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తుందని, రాములవారి దయతో రాబోయే పుష్కరాల నాటికి భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులన్నింటినీ వంద శాతం పూర్తి చేస్తామన్నారు.
అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Minister Ponguleti) అర్చకులు, దేవస్థాన అధికారులు మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి ప్రధాన ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, అక్కడ జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాకార మండపంలో పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అనంతరం అధికారులతో కలిసి పనులను పరిశీలించిన మంత్రి, శ్రీరామనవమి పర్వదినాన రూ.351 కోట్లతో భద్రాద్రి అభివృద్ధికి పరిపాలన అనుమతులు సాధించి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని గుర్తుచేశారు. మూలవిరాట్టు ఉన్న ప్రధాన ఆలయ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, జాగ్రత్తలతో ఆలయ ప్రాకారాలు, నాలుగు వైపుల గోపురాలు, మాడవీధుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, కొంతమంది భక్తులు కోరిన విధంగా పుష్కర ఘాట్లు, ఆలయం నుండి గోదావరి నదికి వెళ్లే రహదారుల విస్తరణ పనులను కూడా ప్రత్యేకంగా పరిశీలించామని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా పనులు పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశామన్నారు.
Read Also: అమర్నాథ్ యాత్రకు బ్రేక్!
Follow Us On : WhatsApp

