అడవి లోగిలిలో ప్రకృతి కోలాహలం!

కలం, ఆదిలాబాద్ బ్యూరో : నేలంతా పచ్చని పందిరి వేసి.. నింగిని తాకే సుందరమైన అడవులు. ఈ అడవుల్లో గాండ్రించే పులులున్నాయి. జింకలు పరుగులు పెడుతున్నాయి. మయూరాలు నాట్యం చేస్తున్నాయి. బాహుబలి బర్రెలు.. అడవి దారుల్లో కనిపిస్తున్నాయి. సరస్సుల్లో జంట బాతులు ఈదుతున్నాయి. రంగు రంగుల పక్షులు.. ఇంద్రధనస్సును మరిపిస్తున్నాయి. వలస పక్షుల రాగాలు.. ప్రకృతి ప్రేమికుల మనసులను హత్తుకుంటున్నాయి.. అందాల స్వర్గం.. కవ్వాల్ అభయారణ్యం (Kawal Tiger Reserve) పై ప్రత్యేక కథనం.

ఆకట్టుకుంటున్న కవ్వాల్ సొగసులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ అడవుల (Kawal Tiger Reserve) అందాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. ఈ అభయారణ్యంలో అడుగు పెడితే చాలు పచ్చని చెట్లే పర్యాటకులను స్వాగత తోరణాలై ఆహ్వానిస్తున్నాయి. ఇరువైపులా ఉండే చెట్ల అందాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. దట్టమైన అడవుల్లో కోట్ల విలువైన టేకు సంపద ఉంది. ఈ టేకు చెట్లు ఎత్తైనవి.. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపిస్తుంటాయి. అదేవిధంగా వెదురు వనాలు, వందల సంఖ్యలో ఔషధ మొక్కలు ఉన్నాయి. తీగ జాతి మొక్కలు అడవంతా అల్లుకున్నాయి. పందిరిని మరిపిస్తుంటాయి. ఈ సోయగాల అడవుల అందాలను చూసి పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వన్యప్రాణుల స్వర్గధామం

ఈ దట్టమైన అడవుల్లో వన్యప్రాణులు ఉన్నాయి. ప్రధానంగా పులి, చిరుత పులులు, జింకలు, దుప్పులు, నీలగాయిలు, అడవి బర్రెలు, ఎలుగుబంట్లు, నక్కలు, అడవి కుక్కలు ఉన్నాయి. అడవిలో అడుగు పెడితే చాలు జింకల మందలు కనిపిస్తుంటాయి. అవి అడవిలో అలికిడి అయితే చాలు.. పరుగులు పెడుతుంటాయి. ఇక అడవి బర్రెల మందలున్నాయి… ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. పెద్ద కొమ్ములు, బాహుబలి ఏనుగును మరిపించే రూపం ఉన్నా వీటిని బాహుబలి అడవి బర్రెలుగా పిలుస్తుంటారు. ఇలా ఎలాంటి వన్య ప్రాణులను చూసినా ఆనందం కలుగుతుందంటున్నారు పర్యాటకులు.

జీవవైవిధ్యానికి ప్రతీకగా కవ్వాల్ అభయారణ్యం

ఒకవైపు వన్యప్రాణులు.. మరోవైపు వలస పక్షుల స్వర్గధామం కవ్వాల్.. అభయారణ్యంలో అనేక చెరువులు, సరస్సులు, కుంటలు ఉన్నాయి. అంతేకాదు సెలయేళ్ల ప్రవాహాలు చూడముచ్చటగా కనిపిస్తుంటాయి. వీటితోపాటు చెరువులు, కుంటల వద్ద దేశ విదేశాల నుండి వచ్చిన పక్షులు సందడి చేస్తున్నాయి.

ప్రధానంగా వడ్రంగి పిట్టలు, బాతులు, పచ్చపిట్ట, గిజిగాడు, ఇండియన్ కుకూ, బ్రెయిన్ ఫీవర్, క్రిస్టెడ్ సర్పెంట్, గద్దలు, జంగిల్ ఔలెట్ ఇలా ఎన్నో రకాలు కనిపిస్తుంటాయి. వీటితోపాటు వివిధ దేశాలు, ఖండాల నుండి వలస పక్షులు వస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ పక్షుల అందాలు చూసి ఆనందాన్ని పొందుతున్నారు పర్యాటకులు.. ఇక్కడ అన్ని రకాల వన్య ప్రాణులు, పక్షులు, అరుదైన వృక్ష సంపద ఉన్న ప్రాంతంగా జీవవైవిధ్యానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఇలాంటి జీవవైవిధ్యం ఉన్న ప్రాంతాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని ఎఫ్‌డీఓ రాంమోహన్ ప్రజలను కోరుతున్నారు.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!

Read Also: అడవి దారి లేక.. ఆగమవుతున్న నల్లమల గిత్త!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>