Mobile Popup Ad
Mobile Popup Ad

అడవి దారి లేక.. ఆగమవుతున్న నల్లమల గిత్త!

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఒళ్లంతా మచ్చలు.. వెనక్కి వంగి ఉండే పెద్ద పెద్ద కొమ్ములు.. ఎత్తయిన ఊపురం.. దృఢమైన గిట్టలు.. కొండలు, గుట్టలు ఎక్కే సామర్థ్యం.. పొడ తూర్పు జాతి పశువుల (Poda Thurpu Cattle) సొంతం. నల్లమలలోని అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో మాత్రమే కనిపించే ఈ పశువులకు 2020లో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. తెలంగాణలో గుర్తింపు పొందిన తొలి స్వదేశీ పశు జాతి ఇది. కానీ ఇప్పుడు వీటికి మేత కరువైంది. శతాబ్దాలుగా నల్లమల అడవి (Nallamala Forest)తో ఉన్న అనుబంధం తెగిపోయింది. అటవీ నిబంధనల కారణంగా అడవిలోకి పశువుల ప్రవేశంపై ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నిషేధం విధించింది. అడవికి తీసుకెళ్లకపోతే పశువుల జీవనశైలి దెబ్బతింటుందని గిరిజనులు అంటున్నారు. అది వాటి ఉనికికే ముప్పు తెస్తుందని ఆవేదన చెందుతున్నారు. అటవీ అధికారులు సహకరించి పశువుల మేతకు అనుమతించాలని కోరుతున్నారు.

తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంత గిరిజనుల జీవనంలో ‘పొడ తూర్పు’ దేశీయ పశువుల జాతి అంతర్భాగం. నాగర్‌ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ప్రధానంగా కనిపించే పశువులను స్థానికంగా ‘మన్ననూర్’ లేదా ‘అడవి పశువులు’ అని కూడా పిలుస్తారు. అడవి జీవన పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక లక్షణాలను సంతరించుకున్న ఇవి గిరిజనుల సంస్కృతి, జీవనశైలికి ప్రతీకగా నిలిచాయి. అరుదైన ఈ జాతి జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే..అటవీ శాఖ నిబంధనలతో పొడ తూర్పు జాతి పశువులకు గడ్డు పరిస్థితులు దాపురించాయి. అటవీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పశువులు మేస్తే సహజంగా పెరిగే గడ్డి, మొక్కలు, చిన్న మొక్కల పెరుగుదల దెబ్బతింటుందని అటవీ శాఖ మేతకు అనుమతి నిరాకరించింది. మరోవైపు నల్లమలలో జింకలు, కుందేళ్లు, అడవి దున్నలు వంటి శాకాహార జంతువులు నివసిస్తాయి. పశువులు ఎక్కువగా మేస్తే వీటికి అవసరమైన గడ్డి, మేత తగ్గిపోతుందని అమ్రాబాద్ ప్రాంతం టైగర్ రిజర్వ్ నిబంధనల మేరకు మానవ కార్యకలాపాలు, పశువుల సంచారం అధికారులు పరిమితం చేశారు. పెంపుడు పశువుల ద్వారా కొన్ని వ్యాధులు అడవి జంతువులకు సోకే ప్రమాదం ఉందని పశువుల ప్రవేశంపై నియంత్రణ విధించారు.

కొండ ప్రాంతపు ట్రాక్టర్లు..!

– పొడ తూర్పు పశువుల శరీరంపై తెలుపు, ఎరుపు, నలుపు రంగుల మచ్చలు కనిపిస్తాయి. ఈ ప్రత్యేక లక్షణం కారణంగానే వీటికి ‘పొడ’ అనే పేరు వచ్చింది. వీటి కొమ్ములు నిటారుగా, పదునుగా ఉండి వెనుకకు వంగి ఉంటాయి.
– ఒంగోలు జాతి పశువులతో పోలిస్తే పరిమాణంలో చిన్నవిగా కనిపించినప్పటికీ, బలంలో మాత్రం ఏమాత్రం తీసిపోవు. ఈ పశువులు కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలతో కూడిన నల్లమల అటవీ ప్రాంతంలో జీవించేందుకు ప్రత్యేకంగా పరిణామం చెందాయి.
– వీటి డెక్కలు చాలా గట్టిగా ఉండటంతో ఎత్తైన ప్రాంతాల్లో సైతం సులభంగా సంచరిస్తాయి. అందుకే స్థానికులు వీటిని ‘కొండ ప్రాంతపు ట్రాక్టర్లు’ అని పిలుస్తారు.
– నీరు, మేత కొరత ఉన్న పరిస్థితుల్లో కూడా ఇవి సులభంగా జీవించగలవు. అడవిలో లభించే ఆకులు, అలములు వంటి సహజ ఆహారంతోనే జీవనం సాగిస్తాయి.
– అంతేకాకుండా వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో సాధారణంగా ఇతర పశువులకు వచ్చే అనేక వ్యాధులు వీటిని అంత త్వరగా ప్రభావితం చేయవు.
– పొడ తూర్పు పశువుల ప్రత్యేకతల్లో వాటి ధైర్యసాహసాలు కూడా ఒకటి. నల్లమల అడవుల్లో సంచరించే పులులను సైతం ఎదుర్కొనే సామర్థ్యం వీటికి ఉందని స్థానికులు చెబుతారు. అందువల్ల వీటికి గిరిజన సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంది.

జాతీయ స్థాయిలో గుర్తింపు

చాలా కాలం పాటు ఈ జాతికి అధికారిక గుర్తింపు లేకపోయింది. అయితే స్థానిక రైతులు, స్వచ్ఛంద సంస్థ వాసన్, పశుసంవర్థక శాఖ చేపట్టిన కృషి ఫలితంగా 2020 ఫిబ్రవరిలో నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్బీఏజీఆర్) దేశంలోని గుర్తింపు పొందిన పశుజాతుల జాబితాలో పొడ తూర్పు జాతిని 44వ దేశీయ పశుజాతిగా నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి పశువుల జాతి కూడా ఇదే కావడం విశేషం. అమ్రాబాద్, అచ్చంపేట ప్రాంతాల్లోని చెంచు, లంబాడ గిరిజన కుటుంబాలు ఈ పశువులను ఎక్కువగా పెంచుతున్నాయి. వ్యవసాయ పనులు, బరువులు లాగడం వంటి పనుల్లో ఎంతో సమర్థంగా పనిచేస్తాయి. రోజుకు సుమారు 2 నుంచి 3 లీటర్ల వరకు మాత్రమే పాలు ఇచ్చినా, వాటి నాణ్యత సాధారణ ఆవు పాల కంటే మెరుగ్గా ఉంటుందని పశుపోషకులు చెబుతున్నారు.

గతంలో ఈ జాతికి సరైన గుర్తింపు లేకపోవడంతో ఇతర జాతులతో సంకరజాతి (క్రాస్‌బ్రీడింగ్) ప్రమాదం ఉండేది. అయితే జాతీయ గుర్తింపు లభించిన తర్వాత వీటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పొడ తూర్పు జాతి స్వచ్ఛతను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఇతర జాతుల కృత్రిమ గర్భధారణపై పరిమితులు విధించింది. అలాగే ఈ పశువులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా రైతులు వాటిని ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు కూడా విక్రయిస్తున్నారు. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న పొడ తూర్పు పశువులు నేడు తెలంగాణ జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలిచాయి. నల్లమల అడవి ఒడిలో పెరిగిన దేశీయ జాతి పశువులు తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వయంశక్తికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ప్రస్తుత వివాదం

– పొడ తూర్పు జాతి పశువులు అడవుల్లోనే మేత మేస్తాయని, అలా అయితేనే వాటి ఎదుగుదల ఉంటుందని గిరిజనులు చెబుతున్నారు. ఇంటి దగ్గర కట్టేసి, మేత వేస్తే పశువుల జీవనశైలి దెబ్బతింటుందని అంటున్నారు. ఈ పశువులకు నల్లమల అడవులతో శతాబ్దాల అనుబంధం ఉన్నదని.. ఇవి అడవి పరిస్థితులకు అనుగుణంగా పెరిగిన స్థానిక జాతి కావడంతో అడవికి పెద్దగా నష్టం చేయవని వాదిస్తున్నారు.

– ఈ పశువులను అడవిలో మేపేందుకు అనుమతులు ఇవ్వకపోతే జాతి పరిరక్షణకే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– పొడ జాతి పశువులు తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన దేశీయ జాతి కావడంతో, ఒకవైపు వాటి పరిరక్షణ అవసరం ఉండగా, మరోవైపు అటవీ సంరక్షణ కూడా ముఖ్యమని ప్రభుత్వం, అటవీ శాఖ భావిస్తున్నాయి.

– దీంతో పశుపోషకుల జీవనాధారం, అటవీ సంరక్షణ మధ్య సమతుల్యత ఎలా సాధించాలనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఫారెస్ట్ అధికారులు సహరించాలి

అమ్రాబాద్ తూర్పు పొడ జాతి పశువుల అభివృద్ధికి సమీప ఫారెస్ట్ అధికారులు సహకరించాలి. అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పశువులు తిరిగితే ప్రమాదం ఉంటుందని, అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తూ పశువుల కాపరులపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఫారెస్ట్ ఏరియాలో పులులు పశువులను చంపిన దాఖలాలే ఉన్నాయి తప్ప.. పులులను చంపిన దాఖలాలు లేవు. ఇది తెలిసినా ఫారెస్ట్ అధికారులు పశువుల కాపరులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఒంగోలు పశు జాతిని అభివృద్ధి చేసిన విధంగా అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో కూడా ‘బుల్ స్టేషన్’ (ఈ జాతి కోడెల వీర్యాన్ని భద్రపరిచేందుకు) ఏర్పాటు చేయడానికి స్థానిక ఎమ్మెల్యే ఒప్పుకున్నారు. ఇందుకు 92 ఎకరాల భూమిని కూడా గుర్తించారు. అయితే ఆ ఫైల్ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. పొడ తూర్పు జాతి పశువుల అభివృద్ధి జరగాలంటే అటవీశాఖ అధికారులు సహకరించాలి.

– జాల మల్లేష్, అమ్రాబాద్ పొడ తూర్పు జాతి పశువుల కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>