బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ఇందూరు జిల్లా ఎడారి.. బీజేపీ నేత ఫైర్

కలం, నిజామాబాద్ బ్యూరో: 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలనలో ఇందూర్ జిల్లా సాగునీటి రంగంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, దీనివల్ల జిల్లా ఎడారిగా మారుతోందని నిజామాబాద్ (Nizamabad) బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి (Dinesh Patel Kulachary) ధ్వజమెత్తారు.  జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని పెద్ద ప్రాజెక్ట్ అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్టు గత బీఆర్ఎస్ పదేళ్లలో సాగునీరు విషయంలో నిర్లక్ష్యానికి గురైందనీ చెప్పుకొచ్చారు.

అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైందని, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతుందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక తట్టేడు మట్టి ఎత్తింది లేదని విమర్శించారు. ప్యాకేజీ 21లో భాగంగా బినోల నుండి సారంగాపూర్ వరకు రూ. 900 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ పంపింగ్ వ్యవస్థను నిర్మించారని, సారంగాపూర్ వరకు పంపులను ట్రయల్ రన్ చేసినప్పటికీ నిరుపయోగంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్సారెస్పీలో నీరు అధికంగా ఉన్నప్పుడు సరైన నిర్వహణ లేక పంపులు మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. సారంగాపూర్ నుండి కొండెం చెరువు వరకు 9 కిలోమీటర్ల మేర సుమారు రూ. 1,200 కోట్లతో పనులు చేపట్టి సారంగాపూర్ నుండి గుత్ప, అలీసాగర్ పరిధిలోని 47 వేల ఎకరాలకు నీరు అందించాలంటే 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. కానీ, కెనాల్ సామర్థ్యం సరిపోక ఆ నీరు బ్రిడ్జిని తాకుతోందని చెప్పుకొచ్చారు.

గత 18 ఏళ్లుగా (గత కాంగ్రెస్, 10 ఏళ్ల బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో) ఈ కాలువల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, సిరికొండ ప్రాంతాల్లో కెనాల్‌ను వెడల్పు చేస్తేనే లక్ష ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ప్రాజెక్ట్ గురించి కనీస అవగాహన కూడా లేదని దినేష్ పటేల్ (Dinesh Patel) విమర్శించారు. ఇటువంటి అజ్ఞానంతో ప్రాజెక్ట్ ఎలా ముందుకు తీసుకెళ్తారని ఆయన ప్రశ్నించారు.

ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి ఇద్దరికీ కమిషన్లు రావాలనే దురుద్దేశంతోనే, పాత డిజైన్ పేరుతో మళ్ళీ రైతన్నను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. పాత డిజైన్ల పేరుతో మళ్ళీ రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే, రైతులు తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో గద్దె భూమన్న, నక్క రాజేశ్వర్, ఓం సింగ్, ఆనంత్ రెడ్డి, కర్క గంగారెడ్డి, చింత శ్రీనివాస్ రెడ్డి, నరేష్, శంకర్ రెడ్డి, శశాంక్, జగన్ రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఇండియాలో పేపర్ కరెన్సీకి చెక్! RBI కీలక అడుగు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>