కలం స్పోర్ట్స్: క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) తన కెరీర్లో సాధించిన మరో రికార్డ్‌ను విరాట్ కోహ్లీ (Virat kohli) బ్రేక్ చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) ఆరంభ మ్యాచ్‌లోనే ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ తరఫున బరిలో దిగిన కోహ్లీ, 16,000 లిస్ట్–A పరుగుల మైలురాయిని చేరుకుని ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.
కోహ్లీ 330వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకోగా, సచిన్ టెండూల్కర్ 391వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను నమోదు చేశాడు. దీంతో 10,000 పరుగుల అనంతరం ప్రతి 1000 పరుగుల మైలురాయిని వేగంగా చేరిన ఆటగాడిగా కోహ్లీ ప్రత్యేక రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 101 బంతుల్లో 131 పరుగులు (14 ఫోర్లు, 3 సిక్సర్లు) నమోదు చేసి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన 299 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 37.4 ఓవర్లలోనే చేధించడంలో కీలక పాత్ర పోషించాడు.
లిస్ట్–A క్రికెట్లో 16,000 పరుగులు వేగంగా చేసిన వారి జాబితా:
విరాట్ కోహ్లీ – 330 ఇన్నింగ్స్
సచిన్ టెండూల్కర్ – 391 ఇన్నింగ్స్
గోర్డన్ గ్రీనిడ్జ్ – 422 ఇన్నింగ్స్
రికీ పాంటింగ్ – 430 ఇన్నింగ్స్
గ్రాహమ్ గూచ్ – 435 ఇన్నింగ్స్
వివ్ రిచర్డ్స్ – 435 ఇన్నింగ్స్
రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌తో మరో రికార్డు సమం
ఇక ముంబై తరఫున రోహిత్ శర్మ (Rohit Sharma) 94 బంతుల్లో 155 పరుగులు చేసి డేవిడ్ వార్నర్ లిస్ట్–Aలో 150+ స్కోర్లు చేసిన రికార్డును సమం చేశాడు. వార్నర్ తొమ్మిది సార్లు ఈ మైలురాయిని చేరుకోగా, రోహిత్ కూడా అదే సంఖ్యను నమోదు చేశాడు. 18 ఫోర్లు, 9 సిక్సర్లతో రోహిత్ ఆడిన ఇన్నింగ్స్ ముంబైకు సిక్కింఫై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం అందించింది.
బీసీసీఐ కొత్త విధానాల ప్రభావం
తాజాగా బీసీసీఐ అమలు చేసిన మార్గదర్శకాల ప్రకారం, జాతీయ జట్టులో ఎంపిక కావాలంటే కేంద్ర ఒప్పందంలో ఉన్న ఆటగాళ్లు దేశీయ టోర్నీల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. ఆస్ట్రేలియాలో భారత జట్టు టెస్ట్ సిరీస్ పరాజయం అనంతరం 2025 జనవరిలో ఈ నియమాలు అమల్లోకి వచ్చాయి.
Read Also: ఇంగ్లండ్ కోచ్‌గా రవిశాస్త్రి?
Follow Us On: Instagram


