కలం స్పోర్ట్స్: యాషెస్ లీగ్‌లో ఎదురవుతున్న పరాజయాలను ఎదుర్కొన్న ఇంగ్లండ్.. తన వ్యూహాలను మార్చాలని ఫిక్స్ అయింది. ఆస్ట్రేలియాను సొంత గడ్డపై మట్టికరిపించాలని తమ ఆలోచన విధానం మారాలని ఇంగ్లండ్ భావిస్తోంది. అందుకోసం కొత్త కోచ్ (England Head Coach) కావాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. కేవలం 11 రోజుల్లోనే ఆస్ట్రేలియా చేతిలో 3-0 తేడాతో ఓటమిపాలైన ఇంగ్లాండ్ జట్టులో ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పదవిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) పేరు మళ్లీ చర్చల్లోకి వచ్చింది.
ఇంగ్లాండ్ జట్టుకు మానసిక ధైర్యం, వ్యూహాత్మక దృష్టి, కఠినమైన పోరాట ఆత్మ ప్రస్తుతం అత్యవసరమని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంలో, భారత జట్టును తన కోచింగ్‌లో ఆస్ట్రేలియా నేలపై రెండు చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాలకు నడిపించిన రవిశాస్త్రి (Ravi Shastri) సామర్థ్యాన్ని ఇంగ్లాండ్ పరిగణనలోకి తీసుకోవచ్చని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఇంగ్లాండ్ స్పిన్నర్ మాంటీ పనేసర్ అభిప్రాయం ఈ చర్చలకు మరింత బలం చేకూర్చింది. “ఆస్ట్రేలియాలో ఎలా ఆడాలో, ఎలా గెలవాలో రవిశాస్త్రికి స్పష్టమైన అవగాహన ఉంది. ఇప్పుడు ఇంగ్లాండ్‌కు అలాంటి వ్యక్తి అవసరం. ఆయనే తదుపరి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని నేను నమ్ముతున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
2018-19 మరియు 2020-21 సిరీస్‌లలో భారత జట్టు ఆస్ట్రేలియాలో సాధించిన విజయాలు ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. ఆ రికార్డులే ఇప్పుడు రవిశాస్త్రిని ఇంగ్లాండ్ కోచ్ రేసులో కీలక అభ్యర్థిగా నిలబెడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మెకల్లమ్ (McCullum) పదవి కొనసాగుతుందా? రవిశాస్త్రి నిజంగా ఇంగ్లాండ్ కోచ్ పదవిని స్వీకరిస్తారా? అన్నది త్వరలోనే తేలనుంది.
Read Also: సెంచరీలతో చెలరేగిన రోకో
Follow Us On: X(Twitter)


