కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలు (Unnao rape case victim)బుధవారం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశారు. దిల్లీలోని 10 జన్‌పథ్‌లో ఉన్న సోనియా నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా బాధితురాలు తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. బాధితులకు అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చూస్తామని సోనియా, రాహుల్ భరోసా ఇచ్చారు.
బాధితురాలితో మాట్లాడిన అనంతరం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. న్యాయం కోసం గొంతెత్తడమే ఆమె చేసిన తప్పా.. అని రాహుల్ ప్రశ్నించారు. బాధితురాలి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అమానవీయంగా ఉందన్నారు. అత్యాచార నిందితులకు బెయిల్ రావడం, బాధితులను నేరస్థుల్లా చూడటం ఏ రకమైన న్యాయమని ఆయన నిలదీశారు. భారత్ కేవలం ఆర్థికంగానే కాకుండా, సామాజికంగా కూడా ఒక నిర్జీవ సమాజంగా మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
సోనియా, రాహుల్‌లను కలిసిన తర్వాత ఉన్నావ్ బాధితురాలు (Unnao rape case victim) మీడియాతో మాట్లాడుతూ.. దిల్లీ హైకోర్టు నిర్ణయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు పిల్లలు లేకపోయి ఉంటే.. ఆత్మహత్య చేసుకునే దానినని ఆవేదన చెందారు. కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసమే ప్రాణాలతో ఉన్నానని చెప్పారు.
దోషి కుల్దీప్ సింగ్ సెంగార్ జైలు నుంచి బయటకు వస్తే తమ ప్రాణాలకు గ్యారెంటీ ఉండదని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ భద్రత కోసం మమ్మల్ని జైలుకు పంపండి అని ఆమె డిమాండ్ చేశారు. నిందితులకు బదులు తానే జైలు శిక్ష అనుభవిస్తానని, అప్పుడైనా తమ ప్రాణాలు దక్కుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్ గాంధీలు తన గోడు విని ఎంతో బాధపడ్డారని, తనకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని ఆమె వెల్లడించారు.


