కలం, వెబ్ డెస్క్: తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రానా వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో శైలజ అనే విద్యార్థిని మృతిచెందిన విషయం తెలిసిందే. అదే ఘటనలో మరో 60 మంది బాలికలు అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటనను NHRC సీరియస్‌గా తీసుకున్నది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామా రావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్‌పై NHRC విచారణ జరిపింది. తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఇప్పటివరకు 866 ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఇది రాష్ట్రంలోని గురుకుల విద్యా వ్యవస్థలో ఆహార భద్రత ఎంత దయనీయ స్థితిలో ఉందో స్పష్టంగా చూపుతోందని కమిషన్ అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలోనే గతంలోనే విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రానా నుంచి సమగ్ర నివేదికను సమర్పించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. నివేదిక సమర్పించకపోవడంపై కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వారాల లోపు పూర్తి స్థాయి, సమగ్ర నివేదికను సమర్పించకపోతే మానవ హక్కుల చట్టం – సెక్షన్ 13 కింద తమకు ఉన్న అధికారాలను వినియోగించి, వ్యక్తిగత చర్యలు (Personal Action) తీసుకుంటామని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.
పాఠశాలల్లో విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న పేద, గిరిజన విద్యార్థుల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యాన్ని సహించబోమని కమిషన్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, రెండు వారాల్లో నివేదిక సమర్పిస్తుందో లేదో అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.


