కలం, ఖమ్మం బ్యూరో: ప్రాణంగా ప్రేమించే తల్లి కళ్లముందే నరకయాతన అనుభవిస్తుంటే చూడలేక, ఆమెను ఎక్కడ కోల్పోతానో అన్న భయంతో ఓ కుమార్తె బలవన్మరణానికి పాల్పడింది. తల్లి ఫొటోపై ‘ఐయామ్ సారీ అమ్మ’ అని రాసి తనువు చాలించింది. ఖమ్మం(Khammam) నగరంలో జరిగిన విషాదకర ఘటన స్థానికులను కన్నీరు పెట్టించింది.
ఖమ్మం(Khammam) నగరంలోని కవిరాజ్ నగర్‌కు చెందిన భట్ల సృజన (18) స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సృజన తండ్రి కనకరాజు ప్రభుత్వ లెక్చరర్‌గా పని చేసేవారు. ఏడేళ్ల క్రితం ఆయన గుండెపోటుతో మరణించారు. తండ్రి మరణం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది. అప్పటి నుండి తల్లి మేరీ పద్మ, సృజన ఇద్దరే కలిసి ఉంటున్నారు.
సృజన తల్లి మేరీ పద్మ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమెకు బ్రెయిన్ ట్యూమర్‌తో పాటు చర్మ, గుండె సంబంధిత వ్యాధులు ఉండటంతో పరిస్థితి విషమంగా మారింది. రోజురోజుకూ క్షీణిస్తున్న తల్లి ఆరోగ్యాన్ని చూసి సృజన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. తల్లి పడుతున్న వేదనను భరించలేక సృజన మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు తన తల్లి ఫొటోపై ‘ఐయామ్ సారీ అమ్మ’ అని రాసి తన ఆవేదనను వ్యక్త పరిచింది.


