కలం, కరీంనగర్ బ్యూరో: తాడిచెర్ల కోల్ బ్లాక్–2 బొగ్గు గని తెలంగాణ రాష్ట్రానికే మణి కిరీటంగా నిలవనుందని.. సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద బొగ్గు గనిగా అభివృద్ధి చెందబోతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా తాడిచెర్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు.
తాడిచెర్ల కోల్ బ్లాక్ అంశం రెండు దశాబ్దాలుగా చర్చలో ఉందని.. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల కోల్‌బ్లాక్–2ను సింగరేణికి కేటాయించే చారిత్రక నిర్ణయం తీసుకుని అమలు చేస్తోందన్నారు.
రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్..
ఈ గని సుమారు 40 నుంచి 50 సంవత్సరాల పాటు ఉత్పత్తి కొనసాగించే సామర్థ్యం కలిగి ఉందని కిషన్ రెడ్డి అన్నారు. దాదాపు 350 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఇక్కడి నుంచి వెలికితీయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ గని సుమారు రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ నమోదయ్యే అవకాశముందని వివరించారు.
వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయ్..
తాడిచెర్ల కోల్‌బ్లాక్–2 ద్వారా సుమారు 2 వేల శాశ్వత ఉద్యోగాలు, 5 వేల కాంట్రాక్ట్ ఉద్యోగాలు ప్రత్యక్షంగా లభిస్తాయని, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. డ్రైవర్లు, హోటళ్లు, లాడ్జీలు, వాహనాల మరమ్మతు కేంద్రాలు, చిన్న పరిశ్రమలు, ఇతర అనుబంధ వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశముందని తెలిపారు. దీంతో ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని పేర్కొన్నారు.
బాహుబలి కోల్ మైన్ ఇది..
దక్షిణ భారతదేశంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద కోల్బ్లాక్గా తాడిచెర్ల కోల్‌బ్లాక్–2 నిలవబోతోందని కిషన్ రెడ్డి అన్నారు. దీనిని “బాహుబలి కోల్ మైన్”గా అభివర్ణించారు. ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి గ్రామ ప్రజలు, సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
అవసరమైన అన్ని పర్యావరణ, పరిపాలనా అనుమతులను త్వరితగతిన పూర్తి చేసి, సింగరేణి ద్వారా తవ్వకాల పనులు వీలైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
కేంద్ర మంత్రికి ధన్యవాదాలు..
సింగరేణి ఆర్జీ వన్ ఏరియా ఓసీపీ-5కి వచ్చిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణలోని బొగ్గు గనులను వేలం పాట లేకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలన్నారు. 12వ వేజ్ బోర్డు ఒప్పంద ప్రక్రియ ప్రారంభించేందుకు తక్షణమే వేతన కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.
తాడిచర్ల బ్లాక్-2ను కేటాయించినందుకు కేంద్ర మంత్రికి శాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కామ్రేడ్ కవ్వంపల్లి స్వామి, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను ఉన్నారు, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్జీ వన్ బ్రాంచి నాయకులు మాదన మహేష్, బోగ సతీష్ బాబు, ఎస్.వెంకట్ రెడ్డి, గండి ప్రసాద్, మానాల శ్రీనివాస్, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, చంద తిరుపతి పాల్గొన్నారు.

