కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఒక ఓటరుకు రెండు చోట్ల ఓటు ఉంటే ఒక ఓటును తీసివేయాలని, అలాగే చనిపోయిన ఓటర్లను జాబితాలో నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక (Narayanpet Collector Priyanka) అధికారులను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట మండలంలోని జిలాల్ పూర్, పేరపళ్ళ గ్రామ పంచాయతీ కార్యాలయాలలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ పత్రాలు పూరించే ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షించారు.
ఈ సందర్బంగా ఓటరు జాబితాలో డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు ఎన్ని ఉన్నాయని బీ ఎల్ వో లను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు పూరించి ఇచ్చిన ఎన్యూమరేషన్ పత్రాలను వెంటనే డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. గ్రామాలలో ఎన్యూమరేషన్ పత్రాలు తీసుకుని, ఇంకా పూరించి ఇవ్వని ఓటర్ల వివరాలు సేకరించి ఫాలోఅప్ చేయాలన్నారు. ఒకవేళ పత్రాలు నింపడం తెలియని ఓటర్లు ఉంటే బీ ఎల్ వో లే అన్ని వివరాలతో పత్రాలు పూరించి యాప్ లో అప్లోడ్ చేయాలని ఆమె ఆదేశించారు.
జిలాల్ పూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలను, అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్ వాడీ కేంద్రంలో నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలించారు. బాలామృతం సక్రమంగా పంపిణీ చేస్తున్నారా లేదా ? అంగన్ వాడీ కేంద్రం పరిధిలో ఎంత మంది గర్భిణీలు ఉన్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
పేరపళ్ళ పల్లె దవాఖానా తనిఖీ
పేరపళ్ళ గ్రామంలోని పల్లె దవాఖానాను కలెక్టర్ ప్రియాంక తనిఖీ చేశారు. పల్లె దవాఖానా ద్వారా గ్రామస్తులకు అందుతున్న వైద్య సేవల పై అక్కడి వైద్య సిబ్బంది తో ఆరా తీశారు. ఇన్ సీ డీ స్క్రీనింగ్ ఎలా చేస్తున్నారని, అవసరమైన మందులు ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అయితే పల్లె దవాఖానా వెనక భాగంలో నిర్మాణం పూర్తయిన సబ్ సెంటర్ భవనం తాళం వేశారని, సబ్ సెంటర్ తాళం తెరిపించి ప్రారంభించాలని గ్రామ సర్పంచి ఆంజనేయులు జిల్లా కలెక్టర్ ను కోరారు.
స్పందించిన కలెక్టర్ వెంటనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్ కు ఫోన్ చేసి సబ్ సెంటర్ ను ఎందుకు ప్రారంభించ లేదని ప్రశ్నించగా, భవనం నిర్మాణ బిల్లు ఇంకా చెల్లించాల్సి ఉందని, అందుకే ఇంకా ప్రారంభించ లేదని జవాబిచ్చారు. వీలైనంత తొందరగా బిల్లు చెల్లించి సబ్ సెంటర్ ను ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీ టీ రామ కృష్ణ, రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, జీ.పీ.వో లు పాల్గొన్నారు.

