కలం, వెబ్ డెస్క్: నిత్యం కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తరచూ కొన్ని సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానీ ఎవరికి చెప్పాలో కూడా తెలియక మౌనంగా భరిస్తుంటారు. కానీ ప్రయాణికులకు కూడా కొన్ని ముఖ్యమైన హక్కులు (Train Passenger Rights) ఉన్నాయని మీకు తెలుసా? అవును రైలులో ప్రయాణించేటప్పుడు ఏవైనా సమస్యలు వస్తే మౌనంగా భరించాల్సిన అవసరం లేదు. వాటిపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ రైల్వే (Indian Railways) నిబంధనం ప్రకారం.. స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లో ప్రయాణించే ప్రయాణికులకు ఫిర్యాదు చేసే హక్కు ఉంటుంది. వీటి గురించి ప్రతి ప్రయాణికుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సమస్య వచ్చినప్పుడు మౌనంగా భరించకుండా ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. అయితే ఎటువంటి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కారణం లేకుండా రైలు నుంచి దించినపుడు
స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లో రిజర్వేషన్‌తో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని సరైన కారణం లేకుండా కోచ్ నుంచి దించే అధికారం ఎవరికీ ఉండదు. ప్రయాణికులతో టీటీఈ కూడా అనుచితంగా ప్రవర్తించే హక్కు లేదు. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి ఎదురైతే ఎటువంటి సంకోచం లేకుండా వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ 139కు కాల్ చేయవచ్చు లేదా రైల్ మదద్ (Rail Madad) యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
సౌకర్యాలు సరిగా లేకపోతే
కోచ్‌లో సౌకర్యాలు సరిగ్గా లేకపోతే ఉదాహరణకు.. సీటు విరిగిపోవడం, కోచ్ పరిశుభ్రంగా లేకపోవడం, ఏసీ పనిచేయకపోవడం, ఛార్జింగ్ పాయింట్ పనిచేయకపోవడం, దుప్పట్లు లేదా బెడ్‌రోల్స్ శుభ్రంగా లేకపోవడం, నాణ్యమైన ఆహారం లేకపోవడం వంటి సమస్యలపై కూడా రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
తోటి ప్రయాణికులు ఇబ్బంది పెడితే
కొన్ని సార్లు తోటి ప్రయాణికులు మద్యం సేవించడం, ధూమపానం చేయడం, పెద్ద శబ్దంతో పాటలు పెట్టడం లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సమయంలో వెంటనే 139కు ఫిర్యాదు చేయవచ్చు. అవసరమైతే రైల్వే రక్షణ దళం (RPF) లేదా రైల్వే పోలీసులను కూడా సంప్రదించవచ్చు.
టీటీఈపై కూడా ఫిర్యాదు చేయొచ్చు
రైల్వే నిబంధనల ప్రకారం.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్లీపర్, ఏసీ కోచ్‌లలో ప్రయాణికులను నిద్రలేపి టికెట్ తనిఖీ చేయకూడదు. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘించి టీటీఈ తనిఖీలు నిర్వహిస్తే టీటీఈపై కూడా ఫిర్యాదు చేసే హక్కు ప్రయాణికులకు (Train Passenger Rights) ఉంటుంది. అయితే రాత్రి 10 గంటల తర్వాత రైలు ఎక్కిన ప్రయాణికులకు ఈ మినహాయింపు వర్తించదని గుర్తుంచుకోవాలి.
ప్రయాణంలో అనారోగ్యానికి గురైతే
ప్రయాణిస్తున్న సమయంలో ఏవైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే టీటీఈ లేదా స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వచ్చు. అవసరమైతే రైల్వే వైద్యులు ప్రథమ చికిత్స అందిస్తారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే సమీప ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు కూడా చేస్తారు.
రైలు ప్రయాణికులు భారతీయ రైల్వేలు కల్పించిన హక్కులు, సౌకర్యాల గురించి తెలుసుకోవడం ద్వారా ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు.
Read Also: ఈ 7 ఆహారాలను మళ్లీ వేడి చేయొద్దు.. నిపుణుల హెచ్చరిక
Follow Us On: Instagram

