కలం, భువనగిరి: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో పోక్సో నిందితుడి ఘాతుకం మరువకముందే.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. యాదాద్రి పోక్సో కేసు (Yadadri POCSO Case)లో రక్షణ కల్పించాల్సిన పోలీసుల అలసత్వమే నిందితుడికి ఆయుధంగా మారిందా? అనే సందేహాలు రేకెత్తిస్తూ ఓ మైనర్ బాలిక కిడ్నాప్‌నకు గురైంది. అఘాయిత్యానికి యత్నించిన కేసులో నిందితుడిని వెంటనే కటకటాల వెనక్కి నెట్టకుండా పోలీసులు స్టేషన్ నుంచే వదిలేయడం.. ఆ వెంటనే అతడు అదే మైనర్ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లడం ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది.
అడ్డగూడూరుకు చెందిన బాలెంల చైతన్య అనే వ్యక్తి స్థానికంగా నివాసముంటున్న ఒక మైనర్ బాలికపై కన్నేశాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గోడదూకి లోపలికి ప్రవేశించి, లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ తీవ్రమైన ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు అడ్డగూడూరు పోలీసులు నిందితుడు చైతన్యపై క్రైమ్ నంబర్ 94/2026 కింద పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే పోక్సో చట్టం కింద కేసు నమోదైతే నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలన్న కనీస నిబంధనను పోలీసులు విస్మరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిందితుడు చైతన్యను అదుపులోకి తీసుకున్నప్పటికీ, రిమాండ్‌కు పంపకుండా స్టేషన్ నుంచే అనధికారికంగా వదిలేశారని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే పోలీసుల అదుపు నుంచి బయటపడిన నిందితుడు చైతన్య, కక్షగట్టి మళ్లీ అదే మైనర్ బాలికపై పగ తీర్చుకోవాలని చూశాడు. బలవంతంగా ఆమెను కిడ్నాప్ చేసి ఎక్కడికో ఎత్తుకెళ్లాడు. ప్రస్తుతం ఆ బాలిక జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
బాధితుల ఫిర్యాదుతో ఎట్టకేలకు మేల్కొన్న పోలీసులు రంగంలోకి దిగి, నిందితుడి కోసం, బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. “పోలీసులు ఆ రోజే కఠినంగా వ్యవహరించి ఉంటే మా బిడ్డ మా కళ్లముందే ఉండేది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వాడిని పట్టుకుని కూడా వదిలేయడం ఏంటి?” అంటూ బాధితురాలి బంధువులు పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
Read Also: ఆ సంస్థతో మాకు సంబంధం లేదు.. ఎన్టీఆర్ ఆఫీస్ కీలక ప్రకటన
Follow Us On: Instagram

