కలం, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (Nagarjuna Sagar Government Polytechnic College ) తన పదేళ్ల చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2026–27 విద్యా సంవత్సరానికి కళాశాలలో ఉన్న మొత్తం 180 సీట్లకు 180 అడ్మిషన్లు (Polytechnic Admissions) పూర్తి చేసి వంద శాతం చేరికలు నమోదు చేసింది. కళాశాల స్థాపన నుంచి ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ అడ్మిషన్ రికార్డు కావడం విశేషం.
2016లో ప్రారంభమైన ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మొదట డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ (DCE), డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (DEEE) కోర్సులతో విద్యా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ రెండు కోర్సుల్లో 80 నుంచి 90 శాతం వరకు అడ్మిషన్లు నమోదయ్యేవి. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ (AMT) కోర్సును ప్రవేశపెట్టడంతో కళాశాల విస్తరణకు కొత్త ఊపు లభించింది.
2021లో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన ఐలయ్య ఆధ్వర్యంలో అడ్మిషన్ల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది సమిష్టిగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పాలీసెట్ విద్యార్థులకు ఉచిత కౌన్సెలింగ్ అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించడం, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టడం వంటి చర్యలు చేపట్టారు. ఈ కృషి ఫలితంగా ఈ ఏడాది 180 సీట్లకు 180 అడ్మిషన్లు పూర్తికావడంతో కళాశాల పదేళ్ల చరిత్రలో తొలిసారిగా వంద శాతం చేరికలు నమోదు చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో నాగార్జునసాగర్ కళాశాల ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఐలయ్య మాట్లాడుతూ.. “ఈ విజయం కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, సాంకేతిక విద్యాశాఖ అధికారులు, అడ్మిషన్ల ప్రచార కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరి సమిష్టి కృషి ఫలితం. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో నాణ్యమైన సాంకేతిక విద్య, ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన ఉపాధి అవకాశాలతో రాష్ట్రంలోనే ఉత్తమ ప్రభుత్వ పాలిటెక్నిక్‌గా కళాశాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాము” అని తెలిపారు.
కళాశాల సాధించిన ఈ ఘన విజయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. ప్రభుత్వ సాంకేతిక విద్యపై విద్యార్థుల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఈ శతశాతం అడ్మిషన్లు నిదర్శనంగా నిలిచాయని వారు పేర్కొన్నారు.

