మార్కెట్ భవనం వెలవెల.. రోడ్లపై రద్దీ రద్దీ

కలం, నిర్మల్: ప్రజలకు సౌకర్యవంతంగా కూరగాయల కొనుగోలు, విక్రయాల కోసం లక్షల రూపాయలతో నిర్మించిన నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలోని  గాంధీ కూరగాయల మార్కెట్ (Gandhi Vegetable Market) ప్రయోజనం లేకుండా పోతోంది. మార్కెట్ భవనం అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాపారులు రోడ్లపైనే కూరగాయలు, పండ్లు విక్రయిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. ఫలితంగా ప్రజలు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోడ్లపైనే దుకాణాలు.. స్తంభిస్తున్న ట్రాఫిక్

ఇందిరానగర్ సమీపంలో ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాపారులు రహదారికి ఇరువైపులా కూరగాయలు, పండ్లు విక్రయిస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పాదచారులు కూడా రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది.

విద్యార్థులు, అత్యవసర సేవలకు ఇబ్బందులు

ఈ రహదారి గుండా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజూ ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. స్కూల్ బస్సులు ఆలస్యమవుతుండగా, అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు, అంతిమయాత్రల వాహనాలు కూడా సకాలంలో వెళ్లలేకపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులకు ఫిర్యాదులిచ్చినా చర్యలు శూన్యం

ఇందిరానగర్, బాగులవాడతో పాటు పరిసర కాలనీల ప్రజలు ఇదే ప్రధాన రహదారిని వినియోగిస్తున్నారు. రోడ్లపై కూరగాయలు విక్రయించడంతో ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నామని, పలుమార్లు జిల్లా, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయలతో నిర్మించిన గాంధీ కూరగాయల మార్కెట్ ఖాళీగా ఉండగా, రోడ్లపైనే వ్యాపారం కొనసాగడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. మార్కెట్‌లో త్రాగునీరు, పారిశుధ్యం, ఇతర సౌకర్యాలు మెరుగుపరిస్తే వ్యాపారులు మార్కెట్‌లోకి వెళ్లే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపారులను మార్కెట్ ప్రాంగణంలోనే విక్రయాలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మార్కెట్‌ను లోపలికి తరలించాలి : కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్

స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. గాంధీ కూరగాయల మార్కెట్‌లోనే వ్యాపారులు విక్రయాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. రోడ్డుపై వ్యాపారం కారణంగా ప్రజలు, అత్యవసర వాహనాలు, అంతిమయాత్రలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>