లార్డ్స్‌లో రికార్డ్.. ఇంగ్లండ్‌పై భారత్‌ ఘన విజయం

కలం, స్పోర్ట్స్ : లార్డ్స్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలి మహిళల టెస్టు (Lords Test Match)లో ఇంగ్లండ్‌పై 270 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. నాలుగో రోజు విజయానికి నాలుగు వికెట్లు మాత్రమే అవసరమైన భారత్.. పని త్వరగా ముగించింది. ఇంగ్లండ్‌ను 186 పరుగులకు ఆలౌట్ చేసింది. 457 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. సోఫీ ఎక్లెస్టోన్ అర్ధశతకంతో పోరాడినా ఫలితం మారలేదు. రోజు ఆట ప్రారంభమైన తర్వాత అమీ జోన్స్ తొలి వికెట్‌గా వెనుదిరిగింది.

స్నేహ్ రాణా ఆమెను ఔట్ చేసింది. ఎక్లెస్టోన్ కొంతసేపు ప్రతిఘటించింది. ఇస్సీ వాంగ్‌తో కలిసి వికెట్ కాపాడే ప్రయత్నం చేసింది. కానీ భారత్ బౌలర్లు మ్యాచ్‌ను చేతుల్లోంచి జారనివ్వలేదు. దీప్తి శర్మ వరుసగా లారెన్ బెల్, ఇస్సీ వాంగ్ వికెట్లు తీశారు. చివరగా స్నేహ్ రాణా ఎక్లెస్టోన్‌ను ఔట్ చేయడంతో భారత్ విజయాన్ని ఖాయం చేసింది. ఈ విజయానికి పునాది మూడో రోజే పడింది. స్మృతి మంధాన, యస్తిక భాటియా అద్భుత సెంచరీలతో ఇంగ్లండ్ ముందు 457 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.

బౌలింగ్‌లో క్రాంతి గౌడ్ ఐదు వికెట్లతో మెరిశారు. ఆమె పేరు లార్డ్స్ హానర్స్ బోర్డులో చోటు దక్కించుకుంది. సయాలి సాత్‌ఘరే, స్నేహ్ రాణా, దీప్తి శర్మ కూడా కీలక పాత్ర పోషించారు. లార్డ్స్ పిచ్‌పై భారత బ్యాటర్లు ఓర్పుగా ఆడారు. బౌలర్లు సీమ్ మూవ్‌మెంట్‌ను సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఈ విజయంతో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇరు జట్లు ఇప్పటివరకు 16 టెస్టులు ఆడగా.. భారత్ నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.

ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన 11 టెస్టులు డ్రాగా ముగిశాయి. ఇంగ్లండ్ చేత భారత్‌కు చివరి ఓటమి 1995లో ఎదురైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భారత జట్టుకు ప్రోత్సాహకర సందేశం ఇచ్చారు. ఐసీసీ ఛైర్మన్ జై షా కూడా స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించారు. అనంతరం సచిన్ ఆటగాళ్లను అభినందించారు. ఈ మ్యాచ్ ఇంగ్లండ్ సీనియర్ క్రికెటర్లు టామీ బీమాంట్, మాజీ కెప్టెన్ హీథర్ నైట్‌కు వీడ్కోలు మ్యాచ్‌గా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>