కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad University)లో నాన్-టీచింగ్ ఉద్యోగాల నియామక పరీక్షలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు యువకులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన డిసెంబర్ 21న జరిగినప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హెచ్‌సీయూ (Hyderabad University) నాన్-టీచింగ్ విభాగంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయగా, డిసెంబర్ 21న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గచ్చిబౌలిలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్ (30), సతీశ్ హాజరయ్యారు.
పరీక్ష రాస్తున్న సమయంలో వీరు షర్టు బటన్లకు అమర్చిన మైక్రో స్కానర్లతో ప్రశ్నాపత్రాన్ని స్కాన్ చేసి, తరచూ బాత్రూమ్కు వెళ్లి ఏఐ సాయంతో సమాధానాలు సేకరించి, చెవిలో ఉన్న బ్లూటూత్ ఇయర్ఫోన్ల ద్వారా వింటూ సమాధానాలు రాస్తున్నారు. అనిల్ చెవిలోని బ్లూటూత్ నుంచి పదేపదే ‘బీప్’ సౌండ్ రావడంతో ఇన్విజిలేటర్లకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా, షర్ట్ బటన్లలో మైక్రో స్కానర్ కనిపించింది.
దీంతో యూనివర్సిటీ అధికారులు మిగతా అభ్యర్థులను కూడా తనిఖీ చేయగా.. సతీశ్ కూడా అదే పద్ధతిలో కాపీయింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. వెంటనే ఇద్దరినీ అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.హెచ్‌సీయూ రిజిస్ట్రార్ దేవేశ్ నిగమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు. మాల్‌ప్రాక్టీస్‌కు ఉపయోగించిన మైక్రో స్కానర్లు, బ్లూటూత్ ఇయర్ఫోన్లు, మొబైల్ ఫోన్లు, మైక్రో ఫోన్లు మొదలైన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: అయోధ్య నుంచి ద్వారక వరకు: సప్త మోక్ష నగరాల ఆధ్యాత్మిక ప్రాధాన్యం
Follow Us On: X(Twitter)


