కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ (Mahabubnagar Collector) కుష్బూ గుప్తా (Khushboo Gupta) విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో నులిపురుగుల నివారణకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి తగ్గడం, కడుపునొప్పి, బరువు పెరగకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు.
డీవార్మింగ్ కార్యక్రమం ద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక వికాసానికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ (Collector Khushboo Gupta) పిలుపునిచ్చారు.
జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా. ఎ. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఒకటి నుంచి రెండు సంవత్సరాల లోపు పిల్లలకు అర మాత్రను పొడిచేసి నీటిలో కలిపి ఇవ్వాలని, రెండు సంవత్సరాలు పైబడిన వారికి 400 మిల్లీగ్రాముల పూర్తి మాత్రను నమిలి మింగేలా ఇవ్వాలని తెలిపారు. ఖాళీ కడుపుతో మాత్రలు వేయకుండా, ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వాలని సూచించారు. పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆయా విద్యాసంస్థల్లో, పాఠశాలలకు వెళ్లని చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాలు, ఆశా కార్యకర్తల ద్వారా ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
పిల్లల గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించడం, పరిశుభ్రమైన నీటిని మాత్రమే తాగించడం, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి వినియోగించడం, బహిరంగ మల విసర్జనకు బదులుగా మరుగుదొడ్లను వినియోగించడం వంటి పరిశుభ్రత అలవాట్లు నులిపురుగుల నివారణకు దోహదపడతాయని వైద్యాధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. ఎన్. శైలజ, డా. బి. శంకర్, డా. రాజు, డా. పులి విద్య, డా. నరేష్ చంద్ర, డా. ప్రవీణ్, మెడికల్ కళాశాలకు చెందిన డా. బిందు, మహాలక్ష్మి, హన్మంతు, నాగరాజు శెట్టి, భాస్కరాచారి, సుభాష్, సీతారామ్, ఆరోగ్య శాఖ సిబ్బంది, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
Read Also : గజ్వేల్ కాంగ్రెస్లో ‘రెబెల్’ మంటలు..పీసీసీ చీఫ్ వర్సెస్ తూంకుంట
Follow Us On: X(Twitter)

