మా ప్రభుత్వానికి స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉంది: భట్టి

కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల్లో నీళ్లు నింపడం ప్రస్తుతానికి అత్యంత ప్రమాదకరమని ఎన్డీఎస్ఏ అధికారులు హెచ్చరించారని.. ఎలాంటి లోపం లేకుండా ప్రాజెక్టు రిపేర్లు పూర్తయ్యే వరకు గేట్లు మూసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోమవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి భట్టి ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టుపై అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. దేవాదుల పెండింగ్ పనులను వేగవంతం చేయడంతో పాటు నిర్వహణ కోసం తక్షణమే రూ.146 కోట్లను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

తప్పుడు ప్రచారాలు చేయడం బాధాకరం..

గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వానికి స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉందని భట్టి చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో నిపుణులు, ఇంజనీర్ల సూచనలను పక్కనబెట్టి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లే కాళేశ్వరం బ్యారేజీలు మూడేళ్లకే దెబ్బతిన్నాయని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా నిర్వహించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం నిపుణుల సాంకేతిక సూచనల మేరకే ప్రతి నిర్ణయం తీసుకుంటుందని భట్టి స్పష్టం చేశారు. దేవాదుల, సీతారామ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల వంటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెస్తామని అన్నారు. రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రత, ప్రజలకు తాగునీటి భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>