కలం, కరీంనగర్ బ్యూరో : ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడుతున్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్ రెడ్డి (Jeevan Reddy) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. మెడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా ప్రాణహిత నది జలాలను కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోయాలని సూచించారు.
అక్కడి నుంచి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలకు నీటిని తరలించడం ద్వారా హైదరాబాద్ తాగునీరు, రామగుండం ఎన్.టి.పి.సి, సింగరేణి విద్యుత్ అవసరాల తీరుతాయన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పంటలకు సాగునీరు అందించవచ్చని జీవన్ రెడ్డి తెలిపారు.
రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన సూచనల ప్రకారం, మెడిగడ్డ సపోర్ట్ లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద రింగ్ బండ్ నిర్మించి నీటిని దిగువకు ఎత్తిపోసే అవకాశం ఉందని ఆయన అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సైతం ఇదే తరహా సూచనలు చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించకుండా నెగిటివ్ గా వ్యవహరిస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు.
కరువు వంటి విపత్కర సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావు లు ప్రజా ప్రయోజనాల కోసం సహకరించాలని జీవన్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రజల తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే కన్నెపల్లి నుంచి నీటి ఎత్తిపోత పనులు ప్రారంభించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

