కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో కార్మిక సంఘాల జేఏసీ (Karimnagar Workers JAC) ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పనులు నిలిపివేసి ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
కార్మిక ర్యాలీలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas), బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అనంతరం కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ చిత్రామిశ్రా కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. పనులు లేకపోవడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కిరాయి ఇళ్లలో, గుడిసెల్లో ఉంటూ పనిచేస్తున్న కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. రైతుబంధు తరహాలో, ప్రమాదవశాత్తూ మరణించిన ప్రతి కార్మికుడికి ‘కార్మిక బంధు (Karmika Bandhu)’ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. 50 ఏళ్లు దాటి ఆరోగ్యపరంగా సహకరించని స్థితిలో ఉన్న ప్రతి కార్మికుడికి 5 వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇవ్వాలని యాదగిరి సునిల్ రావు డిమాండ్ చేశారు. 60 ఏళ్ల వరకు ఇస్తున్న లేబర్ కార్డు గడువును 70 ఏళ్ల వరకు పెంచాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా భవన నిర్మాణ కార్మిక ఐక్య సంఘం జేఏసీ (Karimnagar Workers JAC) సభ్యుడు చాడ ఆనంద్, కన్నం మల్లేశం, ఎండి షరీఫ్, దావు ముత్యం, చెంచయ్య, రాజు, నారాయణ, భామండ్ల శివకుమార్, సోమిరెడ్డి అంజయ్య, దాచే అశోక్, పోచమల్లు, రఫీ తదితరులు పాల్గొన్నారు.
Read Also: పాలిటిక్స్‌లోకి ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చిన టీం
Follow Us On: X(Twitter)

