రక్తదాహం, అధికార దాహం ఎవరికి ఉందో ప్రజలకు తెలుసు: ఎంపీ చామల

కలం, భువనగిరి : తెలంగాణలో రక్తదాహం, అధికార దాహం, ధన దాహం ఎవరికి ఉందో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) మండిపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనను చూసే ప్రజలు వారిని ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్, కేసీఆర్ కుటుంబ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఇక్కడ విద్యార్థులు, యువత బలిదానాలకు కారకులు ఎవరో కేటీఆర్ తన బావ హరీష్ రావును అడిగి తెలుసుకోవాలి” అని చామల డిమాండ్ చేశారు.

తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, తాను కేవలం వాచ్‌మెన్‌లా ఉంటానని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట తప్పి, తన ఇంట్లోనే ఐదారు ఉద్యోగాలు (మంత్రి పదవులు) ఇచ్చుకున్నారని విమర్శించారు. అసలు మంత్రి పదవి రాలేదనే కారణంతోనే కేసీఆర్ నాడు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. కేటీఆర్ అసలు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారని ఎంపీ చామల ప్రశ్నించారు. “నాడు టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ కోసం కేసీఆర్ తన కొడుకు ‘అజయ్ రావు’ పేరును ‘కేటీఆర్’గా మార్చారు. ఆ తర్వాత 2009లో ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి పొట్టగొట్టి కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారు” అని ఆరోపించారు.

ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను జాతిపిత అన్న కేసీఆర్, 2014లో సీఎం కాగానే తానే జాతిపితనని డబ్బా కొట్టుకున్నారని విమర్శించారు. ప్రపంచంలో ఎవరైనా రాజకీయాల కోసం సొంత పార్టీ పేరును మార్చుకుంటారా అని ప్రశ్నించారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో, బ్యారేజీలు ఎందుకు కుంగాయో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలే చెబుతున్నాయని చామల పేర్కొన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణను పెనం మీద నుంచి పొయ్యిలో పడదోసిందని, ఒక్క దక్షిణ తెలంగాణ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా రంజక పాలన సాగిస్తూ చేస్తుంటే, ప్రతి పనిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌ను ఎంపీగా గెలిపించింది బీఆర్ఎస్ పార్టీయేనని, తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీ స్థానాలు ఎలా వచ్చాయో ప్రజలందరికీ తెలుసన్నారు. కేసీఆర్ కుటుంబ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. “నాడు తెలంగాణ ఇచ్చినందుకు ఢిల్లీలోని 10 జనపథ్‌కు వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కి వచ్చిన కేసీఆర్ కుటుంబం, నేడు కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఇప్పటికైనా కేటీఆర్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలి” అని చామల కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>