కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులోని మదురై (Madurai Accident) జిల్లా కొట్టంపట్టి సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి, డివైడర్ దాటి అవతల వైపు ఎదురుగా వస్తున్న ప్రభుత్వ రవాణా సంస్థ బస్సును ఢీకొట్టింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 42 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
చెన్నై నుంచి మార్తాండం వైపు ప్రైవేట్ బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై సమచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బస్సు శిథిలాల మధ్య ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

