ఫిఫా సెమీస్‌లోకి అర్జెంటీనా, ఇంగ్లాండ్.. సెమీఫైనల్ మ్యాచ్‌లు ఎప్పుడంటే?

కలం, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్ కప్‌ (FIFA World Cup) లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా (Argentina) సెమీస్‌కు దూసుకెళ్లింది. 3–1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్‌ను మట్టికరిపించింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లియోనెల్ మెస్సి (Lionel Messi) నేతృత్వంలోని అర్జెంటీనా ఆట మొదలైన 10 నిమిషాలకే గోల్ కొట్టింది. మెస్సి అందించిన కార్నర్‌‌ పాస్‌ను అలెక్సిస్ అలిస్టర్ గోల్‌గా మలిచి జట్టుకు శుభారంభాన్ని అందించాడు.

ఆపై అర్జెంటీనా ఆధిపత్యమే కొనసాగింది. కానీ 67వ నిమిషంలో స్విట్జర్లాండ్ ప్లేయర్ డాన్ ఎండోయె గోల్‌ సాధించి, అర్జెంటీనాకు షాక్ ఇచ్చాడు. దీంతో రెండు జట్ల స్కోర్ సమం అయింది. కానీ కొంతసేపటికే స్విస్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో రెడ్‌ కార్డ్‌ ఎదుర్కొని బయటకు వెళ్లిపోవడంతో 10 మందితోనే ఆ జట్టు పోరాడింది. ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ గట్టి పోటీ ఇచ్చింది. అయితే చివరకు అర్జెంటీనా ఆటగాళ్లు వరుసగా రెండు గోల్స్ కొట్టి జట్టుకు విజయం అందించారు. 112వ నిమిషంలో జులియన్ అల్వరెజ్, 121వ నిమిషంలో లౌటరో మార్టినెజ్ గోల్స్ చేశారు.

ఇంగ్లాండ్ సంచలనం..

ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లాండ్ (England) సరికొత్త చరిత్ర సృష్టించింది. థామస్ టూషెల్ నేతృత్వంలోని ఆ జట్టు 2-1 తేడాతో నార్వేపై అద్భుత విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ నిర్ణీత 90 నిమిషాల్లో 1-1తో సమం కావడంతో ఎక్స్‌ట్రా టైమ్‌లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది.

ఇంగ్లాండ్ స్టార్ మిడ్‌ ఫీల్డర్ జుడె బెల్లింగ్‌హామ్ రెండు గోల్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆదివారం ఉదయం మ్యాచ్ జరగ్గా, మొదటి నుంచి ఇంగ్లాండ్‌పై నార్వే ఒత్తిడి తెచ్చింది. 36వ నిమిషంలో నార్వే ప్లేయర్ ఆండ్రియాస్ షెల్డెరప్ కొట్టిన క్రాస్-షాట్ గోల్‌గా మారడంతో ఆ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట తొలి భాగం ముగుస్తుందనగా ఇంగ్లాండ్ ఆటగాడు జుడే బెల్లింగ్‌హామ్ గోల్‌ కొట్టి స్కోర్ సమం చేశాడు.

మ్యాచ్ రెండో భాగంలో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోవడంతో ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. ఎక్స్‌ట్రా టైమ్ ప్రారంభమైన కొద్దిసేపటికే (93వ నిమిషంలో) ఇంగ్లాండ్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మోర్గాన్ రోజర్స్ కొట్టిన బంతిని నార్వే కీపర్ నీలాండ్ సరిగ్గా అందుకోలేక వదిలేశాడు. అక్కడ సిద్ధంగా ఉన్న బెల్లింగ్‌హామ్ దాన్ని గోల్‌గా మలిచి ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించాడు.

సెమీస్‌లో టఫ్ ఫైట్..

ఫిఫా సెమీఫైనల్స్‌లో ఫ్రాన్స్, స్పెయిన్.. అర్జెంటీనా, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. ఈ నెల 15న ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య మ్యాచ్ జరగనుండగా.. ఈ నెల 16న అర్జెంటీనా, ఇంగ్లాండ్ మ్యాచ్ జరగనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>