కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో ఒక మైనర్ బాలిక (Minor Girl) పై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి (గ్యాంగ్ రేప్) పాల్పడ్డారు. కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే 17 ఏళ్ల బాలికకు, అదే ప్రాంతానికి చెందిన ఒక ఆటో డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. సదరు ఆటో డ్రైవర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ నమ్మించి, ఆమె వెంటపడేవాడు.
ఈ క్రమంలో, కొన్ని రోజుల క్రితం అతను బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లాడు. బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన సదరు ఆటో డ్రైవర్, అక్కడ అప్పటికే ఉన్న తన స్నేహితులైన మరో ఇద్దరు ఆటో డ్రైవర్లతో చేతులు కలిపాడు.
ముగ్గురూ కలిసి బాలికను భయపెట్టి, బెదిరించి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఉదంతం గురించి బాలిక తన తల్లికి చెప్పడంతో బాధితురాలి తల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

