కలం, ఖమ్మం బ్యూరో: ప్రస్తుత రోస్టర్ విధానం వల్ల ఉద్యోగ నియామకాల్లో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం నిర్వహించిన ‘మాలల ఐక్యత సదస్సు’లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
100 పోస్టులు నష్టపోయిన మాలలు..
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ తర్వాత గ్రూప్-3 కేటగిరీ కింద ఉన్న మాలలకు ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించినప్పటికీ, రోస్టర్ పాయింట్ల లెక్కింపులో లోపాల వలన ఆచరణలో 2.8 శాతం మాత్రమే దక్కుతోందన్నారు. దీంతో ఇటీవల వచ్చిన నోటిఫికేషన్లలో మాల సామాజికవర్గానికి రావాల్సిన సుమారు 100 పోస్టులు నష్టపోవాల్సి వచ్చిందని వివరించారు.
రేపు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం..
ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని తాను కేబినెట్ సమావేశంలో మూడు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి వివేక్ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సమస్యపై రేపు ఉదయం 11 గంటలకు సబ్ కమిటీ మొదటి సమావేశం జరగనుందననారు. మాలలకు జరిగిన అన్యాయాన్ని సరి చేసేలా త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వారికి నెలకు రూ.2 లక్షల వేతనం..
అనంతరం స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల విదేశీ ఉపాధిపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టామ్ కామ్ సంస్థ ద్వారా ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగులకు జర్మన్, జపనీస్ భాషల్లో ఉచిత శిక్షణ ఇప్పిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందన్నారు. తద్వారా నెలకు రూ.2 లక్షల వేతనం పొందే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

