కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) జిల్లా అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పని చేస్తూ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Lakshman Kumar) పిలుపునిచ్చారు. ఆదివారం జగిత్యాల జిల్లా చల్ గల్ (Chelgal) గ్రామంలో కేంద్రీయ విద్యాలయానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయానికి (Kendriya Vidyalaya) చల్ గల్ వాలంతరి భూములు కేటాయించడం ఒక సవాలుగా మారిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒప్పించి క్యాబినెట్‌లో తీర్మానం చేసి ఐదు ఎకరాల భూమిని కేటాయించినట్లు మంత్రి వివరించారు.
కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయించినందుకు ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదల శాఖ మంత్రికి మంత్రి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడం సంతోషమని మంత్రి తెలిపారు. పార్టీలకు అతీతంగా జగిత్యాల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ కలిసి రావాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. సంక్షేమ శాఖ మంత్రిగా వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల కేంద్రీయ విద్యాలయంలో 50 శాతం సీట్లు స్థానికులకు, 50 శాతం సీట్లు త్రివిధ దళాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తామని ఎంపీ తెలిపారు.
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల సంక్షేమ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కొరకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకువస్తూ దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రాష్ట్రంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే సత్యం తెలిపారు.
జగిత్యాల (Jagtial) ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. చల్ గల్‌లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని భావించి ఇక్కడ స్థలం కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ సారించినట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: కమలంలో కలవరం.. ‘ఈటల’ గురి ఎటు?
Follow Us On: Instagram

