కమలంలో కలవరం.. ‘ఈటల’ గురి ఎటు?

కలం, తెలంగాణ బ్యూరో : ‘తెలంగాణ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్’ అంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. తెలంగాణ ప్రయోజనాల గురించి చేసిన వ్యాఖ్యగా కనిపించినా రాజకీయంగా దీని వెనుక ఉద్దేశమేంటనే డిస్కషన్ మొదలైంది. బీజేపీ నినాదమే ‘నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. పర్సనల్ లాస్ట్’. ఆ నేపథ్యాన్నే తెలంగాణకు అన్వయించుకున్నారనే సమర్థన కూడా వినిపిస్తున్నది.

కానీ, కొంతకాలంగా ఈటల వ్యవహార శైలి, బీజేపీలో ప్రాధాన్యం తగ్గుతున్నదనే మాటలు, బీఆర్ఎస్‌పై అప్పుడప్పుడు వ్యక్తమవుతున్న సాఫ్ట్ స్టాండ్.. ఇవన్నీ ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు అనే ఆసక్తికర చర్చకు దారితీసింది. బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణలో బీఆర్ఎస్‌ను రాజకీయ ప్రత్యర్థిగా టార్గెట్ చేస్తున్నది. కాళేశ్వరాన్ని ఏటీఎంలా బీఆర్ఎస్ మార్చుకున్నదని బీజేపీ అగ్రనేతలు ఎన్నోసార్లు ఆరోపించారు. కానీ, కాళేశ్వరం విషయంలో ఈటల వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ ను సమర్థించేలా ఉండటం.. బీజేపీ శ్రేణుల్లో కన్ఫ్యూజన్‌కు కారణమయ్యాయి.

కాళేశ్వరంపై హైకమాండ్‌ ఒకలా..!

కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టుపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్రస్థాయిలోనే విమర్శలు చేస్తున్నాయి. “కల్వకుంట్ల ఫ్యామిలీకి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారింది.. అవినీతి జరిగింది..” అంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా తాజాగా బీజేపీ నేషనల్ చీఫ్ నితిన్ నబిన్ ఘాటుగా విమర్శించారు. కూలేశ్వరం అంటూ ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈటల రాజేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ బీజేపీ వైఖరికే విరుద్ధంగా ఉన్నాయన్న చర్చ అంతర్గతంగా మొదలైంది.

“ప్రాజెక్టులో లోపాలుంటే సరిచేయాలి.. కానీ మొత్తం ప్రాజెక్టునే పక్కన పెట్టొద్దు. రైతులకు ఉపయోగపడేలా చూడాలి. ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం కీలకం” అని ఈటల వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌ను బీజేపీ రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నా ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీగా ఉంటూనే బీఆర్ఎస్‌ను సమర్థించే తీరులో మాట్లాడడం, దానికితోడు అదే సందర్భంగా ‘తెలంగాణ ఫస్ట్’ (Telangana First) అనే టాగ్ లైన్ జోడించడం కమలనాథులనే ఆలోచనలో పడేసింది. ఇప్పటికే ప్రత్యేక గ్రూపు నడుపుతున్నారనే ఆరోపణల టైమ్‌లో తాజా వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ అదే లైన్..!

ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఈటల రాజేందర్ (Eatala Rajender) వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. “కేవలం ఒకరిద్దరి వల్ల జరిగిన పని.. మొత్తం వ్యవస్థను నిందించకూడదు” అని ఆయన అప్పట్లో కామెంట్ చేశారు. దీన్ని బీజేపీ వర్గాల్లోనే కొందరు జీర్ణించుకోలేకపోయారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీ తీవ్రస్థాయిలో దాడి చేస్తున్న సమయంలో ఈటల ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీసింది. “తెలంగాణ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్” అనే ఈటల తాజా వ్యాఖ్యలు సాధారణం కాదనే అభిప్రాయానికి తావిచ్చినట్లయ్యాయి.

జాతీయ పార్టీ నాయకుడిగా పార్టీ విధానాలకు భిన్నంగా తెలంగాణ ప్రయోజనాలను పార్టీ కంటే ముందు ఉంచుతున్నాననే సంకేతాన్ని ఈటల రాజేందర్ ఇస్తున్నట్లు తాజా కామెంట్లు ఉన్నాయి. అయితే.. తాను బీజేపీ నేతను మాత్రమే కాదని, తెలంగాణ రాజకీయాల్లో స్వతంత్ర గుర్తింపు ఉన్న నాయకుడిననే సందేశం ఇవ్వాలనే తాపత్రయం ఆయనలో కనిపిస్తున్నదనే మాటలు వినిపిస్తున్నాయి. బీజేపీలో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం లభించకపోవడం, పార్టీ పూర్తిగా ఆయనను విశ్వసించడంలేదనే వాతావరణం, ఆయనను బీసీ ఫేస్‌గా భావించినా బండి సంజయ్ లాంటి నేతల చుట్టూనే పార్టీ రాజకీయాలు తిరుగుతున్నాయనే అసంతృప్తి.. వీటన్నింటితో అందులో ఇమడలేకపోతున్నారనే వాదన ఉంది.

కేంద్ర మంత్రి పదవిపై ఆశలు తగ్గడంతో..!

త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి అవకాశం ఎవరికనే ప్రశ్న తలెత్తింది. పార్టీ అంతర్గత సమీకరణలు, సామాజిక సమతుల్యత, కేంద్ర నాయకత్వం ప్రాధాన్యతలు చూస్తే అవకాశం ఈటల రాజేందర్‌కు దక్కకపోవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. ఈ కారణంగానే ఆయన తన రాజకీయ ప్రాధాన్యాన్ని నిలుపుకునేలా ప్రత్యేక లైన్ తీసుకుంటున్నారనే అభిప్రాయాలూ లేకపోలేదు.

బీఆర్ఎస్ నుంచి ఆయన రాజకీయ ప్రయాణం మొదలైనందున ఘాటుగా మాట్లాడకుండా సాఫ్ట్‌ గా వ్యవహరిస్తున్నారని, బీజేపీలో ఇమడలేని పరిస్థితుల్లోనే భవిష్యత్ రాజకీయ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ వైఖరి తీసుకున్నారనే అభిప్రాయాలు పలువురు బీజేపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి దూరమవుతారా?.. బీఆర్ఎస్‌కు దగ్గరవుతారా?.. తెలంగాణ సెంటిమెంట్‌తో కొత్త పొలిటికల్ స్పేస్ వెతుక్కుంటారా?.. ఇలాంటి అనుమానాలన్నింటికీ ఆయన అడుగులే బదులిస్తాయని వారు అంటున్నారు.

Read Also: ఉపాధ్యాయ సంఘాలకు బిగ్ షాక్.. టీచర్ల సంచలన తీర్మానం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>