‘క్షణకాలపు అజాగ్రత్త.. జీవితకాలపు ఆవేదన’.. సజ్జనార్ కీలక పోస్ట్

కలం, వెబ్ డెస్క్ : “క్షణకాలపు అజాగ్రత్త… జీవితకాలపు ఆవేదనకు దారితీస్తుంది!” అనడానికి సాక్ష్యంగా నిలిచిన ఒక ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ దృశ్యాలను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (Sajjanar) ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పంచుకున్నారు. వాహనాలను నిలిపివేసే క్రమంలో తల్లిదండ్రులు చేసే చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతటి పెను ప్రమాదనానికి దారితీస్తుందో తన పోస్టు ద్వారా తెలియజేశారు.

ఆ చిన్న పొరపాటుతో ఊహించని ముప్పు..!

సాధారణంగా చిన్నారులకు బైక్ ఎక్కడం ఒక సరదా అని, యాక్సిలరేటర్ తిప్పడం ఒక సంబురం అని పేర్కొన్నారు. కానీ, వాహనం స్టార్ట్ చేసి ఉన్నప్పుడు వారు తెలియక చేసే ఆ చిన్న పొరపాటే క్షణాల్లో ఊహించని ప్రమాదంగా మారి ప్రాణాల మీదికి తెస్తుందన్నారు. ఈ మేరకు సీసీటీవీ రికార్డు అయ్యి సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్న వీడియోను సజ్జనార్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ వీడియోలో  స్టార్ట్ చేసిన బైక్ పై కొడుకు ఉండగానే ఓ తండ్రి కిందకు దిగారు. సదరు తండ్రి బైక్ పై నుంచి దిగిన వెంటనే చిన్నారి యాక్సిలరేటర్ ఇవ్వడంతో కొంత దూరం వెళ్లి బైక్ తో సహా పడిపోయాడు. అదృష్టవశాత్తు ఆ చిన్నారికి భారీ గాయం కాలేనట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.

ఈ వీడియో ద్వారా సజ్జనార్ తల్లిదండ్రులను హెచ్చరిస్తూ పలు సూచనలు చేశారు. కళ్లముందే నిమిషం వ్యవధిలో జరిగిపోయే ఇలాంటి దారుణాలను అడ్డుకోవాల్సింది తల్లిదండ్రులేనన్నారు. వాహనం నిలిపివేసిన వెంటనే ఇంజిన్ ఆపి, కీ తీసేయడం ప్రాథమిక నియమంగా మార్చుకోవాలని తెలిపారు. ఇంజిన్ ఆన్‌లో ఉన్న టూ-వీలర్‌పై చిన్నారులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటరిగా కూర్చోబెట్టకూడదని .. ముఖ్యంగా పిల్లల చేతులు యాక్సిలరేటర్‌కు అందేలా వాహనాల ముందు భాగంలో నిలబెట్టడం అత్యంత ప్రమాదకరమని గ్రహించాలని సూచించారు. సురక్షిత ప్రయాణం అనేది బాధ్యతాయుత ప్రవర్తనతోనే సాధ్యమవుతుందని గుర్తిస్తూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>