కలం, వెబ్‌డెస్క్: నేటి డిజటల్ యుగంలో టెక్నాలజీ మానవ జీవితాన్ని సులభతరం చేసింది. తినే ఫుడ్ దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు.. ఇలా ప్రతి వస్తువును కూర్చున్న చోటు నుంచే చేతికందించేలా టెక్నాలజీ ఎదిగింది. ప్రయాణ రంగంలోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది, అందులోనూ ఆన్‌లైన్ రైల్వే టికెట్ల కొనుగోలు విధానం మైలురాయిగా చెప్పుకోవచ్చు.
ఇండియన్ రైల్వేస్ (Indian Railways) అందిస్తున్న ఐఆర్‌టీసీ, ఇతర బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ-టికెట్ల బుకింగ్ చాలా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు భారతీయ రైల్వే సంస్థ కీలక సూచనలు జారీ చేసింది. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రయాణికులు ఈ-టికెట్‌ను స్క్రీన్‌షాట్ తీసుకుని లేదా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసుకుని, ప్రయాణ సమయాల్లో దాన్నే అసలు టికెట్‌గా చూపిస్తున్నారు. అయితే, కేవలం వాట్సాప్ స్క్రీన్‌షాట్ లేదా ఫార్వర్డ్ చేసిన టికెట్ ఇమేజ్ మాత్రమే ఉంటే అది చెల్లుబాటు కాదని, టికెట్ తనిఖీ సమయంలో తప్పనిసరిగా ఈ-టికెట్ లేదా అధికారికి ధ్రువీకరణ పత్రం ఉండాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
స్క్రీన్‌షాట్లు ఎందుకు చెల్లవు?
రైల్వే అధికారుల ప్రకారం పెరిగిన టెక్నాలజీతో స్క్రీన్‌షాట్లు లేదా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసిన చిత్రాలను సులభంగా ఎడిట్ చేసి మార్పులు చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా ఒకే చిత్రాన్ని ఎక్కువ మందికి పంపించే అవకాశం కూడా ఉంది. దీంతో టికెట్ దుర్వినియోగానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రయాణికుల వివరాలను అసలు బుకింగ్ రికార్డులతో సరిపోల్చి టీటీఈ ధ్రువీకరిస్తారు. కేవలం స్క్రీన్‌షాట్ ఆధారంగా టికెట్ ప్రామాణికతను నిర్ధారించడం సాధ్యం కాదని అధికారులు వెల్లడించారు.
చెల్లుబాటు అయ్యే టికెట్లు ఇవే?
1. ఐఆర్‌టీసీ రైల్ కనెక్ట్ యాప్ లేదా అధికారిక బుకింగ్ ఫ్లాట్ ఫారమ్‌లో కనిపించే అసలు ఈ-టికెట్ ఉండాలి.
2. బుకింగ్ సమయంలో వచ్చిన అధికారిక మెసేజ్ అయినా ఉండాలి.
3. ఈ టికెట్ ప్రింటెడ్ కాపీ.
4. వీటితో పాటు ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వంటి ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు ఉండాలి.
5. టికెట్‌లో ఉన్న పేరు, ఐడీ కార్డులోని పేరుతో తప్పనిసరిగా సరిపోవాలి.
ప్రయాణ సమయంలో పై వాటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు.
ప్రయాణికులకు రైల్వే సూచనలు
- రైలు ప్రయాణానికి సిద్ధమయ్యే వారు ముందస్తు జాగ్రత్తగా తమ స్మార్ట్‌ఫోన్‌లోని ఐఆర్‌టీసీ యాప్‌లో ఈ-టికెట్ సరిగ్గా అందుబాటులో ఉందో లేదో ముందే సరిచూసుకోవాలి.
- టికెట్ బుక్ అయినప్పుడు మొబైల్‌కు వచ్చే అధికారిక కన్ఫర్మేషన్ SMS ను పొరపాటున కూడా డిలీట్ చేయవద్దు.
- ప్రయాణ సమయంలో టీటీఈ అడిగిన వెంటనే చూపించేందుకు ఆధార్, పాన్ లేదా ఓటర్ కార్డ్ వంటి చెల్లుబాటు అయ్యే అసలు ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉండాలి.
- ప్రయాణం ముగిసే వరకు ఫోన్‌కు తగినంత ఛార్జింగ్ ఉండేలా చేసుకోవడం అసరం.
- ఒకవేళ స్విచ్ ఆఫ్ అయ్యే ప్రమాదం ఉంటే ముందస్తు జాగ్రత్తగా ఈ-టికెట్ ప్రింట్ అవుట్‌ను దగ్గర ఉంచుకోవాలని సూచిస్తున్నారు రైల్వే అధికారులు.

