కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థి సంఘాల (Student Unions) పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌కు (Education Bandh) స్పందనగా జిల్లాలోని పలు పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా బాయ్స్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు.
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భరత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి సీతారాం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించలేక పలువురు విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యాశాఖలో ఎంఈఓ, డీఈఓ వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేసి విద్యా పరిపాలనను బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
విద్యారంగానికి పూర్తిస్థాయి నాయకత్వం అవసరమని, విద్యాశాఖ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టకుండా విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, త్రాగునీరు, మరుగుదొడ్లు, వసతి గృహాల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తమ డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మారుతితో పాటు విద్యార్థి సంఘాల నాయకులు శేఖర్, లింగం, ధర్మతేజ, విజయ్, సతీష్, నందు, ఈశ్వర్, బాలకృష్ణ, మణికంఠ, వెంకటేష్, సాయి, హారిక, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణకు శాపంగా రేవంత్ రెడ్డి: హరీశ్ రావు
Follow Us On : WhatsApp

