కలం, భువనగిరి: బీఆర్ఎస్ భరోసా లేని పార్టీగా తయారైందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఎద్దేవా చేశారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోని క్యాడర్‌ను కాపాడుకోవడానికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాధారమైన, సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అంశాలు, సినిమా వాళ్ల ఫోన్లు వింటున్నారంటూ కేటీఆర్ లేనిపోని కలలు కంటున్నారని ఎంపీ చామల విమర్శించారు. గతంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో కూడా సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయంటూ కేటీఆర్ గొప్పలు చెప్పుకున్నారని, కానీ ఫలితాలు చూస్తే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ లాంటి సిట్టింగ్ స్థానాలను సైతం బీఆర్ఎస్ ఘోరంగా కోల్పోయిందని ఆయన గుర్తు చేశారు.
ఇదే సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) స్పష్టతనిచ్చారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తన పెత్తనం ఏమీ లేదని, అక్కడ తమ మధ్య ఎలాంటి పంచాయతీలు లేవని ఆయన స్పష్టం చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు తనకు సోదరుడి లాంటివాడని పేర్కొన్నారు.
తుంగతుర్తి సమస్యను తమ ఇంటి సమస్యగా భావిస్తున్నానని, వివాదాన్ని త్వరగానే సద్దుమణిగించాలని ఆశించినట్లు తెలిపారు. తాను స్వచ్ఛమైన కాంగ్రెస్ కార్యకర్తనని చెప్పిన చామల.. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మండల కమిటీ అధ్యక్షుల నియామక విషయంలో అందరినీ సంప్రదించి, కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మాత్రమే తాను మందుల సామెలుకు సూచించినట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
Read Also: బీఆర్ఎస్‌కు భరోసా లేదు.. కేటీఆర్‌పై ఎంపీ చామల ఫైర్
Follow Us On: Instagram

