కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రిక్రూట్ చేసుకున్న నర్సింగ్ ఆఫీసర్లకు (Nursing Officer) పోస్టింగులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ మెడికల్-హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా వెబ్ ఆప్షన్ల కోసం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా విల్లింగ్, వెబ్ ఆప్షన్లను స్వీకరించి, మెరిట్ ఆధారంగా పోస్టింగులను ఖరారు చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం జూలై 11, 2026 నుంచి అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న ఆప్షన్లలో ఏవైనా మార్పులు ఉంటే జూలై 12, 2026న సవరించుకునే అవకాశం కల్పించారు. అనంతరం జూలై 13, 2026న తుది పోస్టింగ్ ఆర్డర్లను అధికారులు అధికారికంగా విడుదల చేస్తారు. రిక్రూట్ అయిన నర్సింగ్ ఆఫీసర్లు (Nursing Officer) తమ మొబైల్ నెంబర్ ద్వారా వెబ్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి ఆన్లైన్ విధానంలోనే ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకసారి నమోదు చేసిన ఆప్షన్లు ఫైనల్ అవుతాయని, అభ్యర్థులు ఎంచుకున్న ప్రాంతాల్లో ఉండే ఖాళీలు, వారి మెరిట్ ర్యాంక్ ఆధారంగానే ఈ కేటాయింపులు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
నిర్ణీత గడువులోగా వెబ్ ఆప్షన్లను నమోదు చేయని అభ్యర్థులకు వైద్యారోగ్య శాఖ అధికారులు కేటాయించిన కేంద్రాల్లోనే విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్ల ప్రక్రియపై ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవడానికి 8143449205 అనే హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వ వైద్యారోగ్య శాఖలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

