హిస్టారికల్ లార్డ్స్.. చరిత్రలోనే తొలిసారి!

కలం, స్పోర్ట్స్ బ్యూరో: లార్డ్స్ బాల్కనీ అనగానే టీమిండియా అభిమానులకు ఠక్కున గుర్తొచ్చేది కపిల్ దేవ్ ఎత్తిన వరల్డ్కప్, గంగూలీ శౌర్యమే..! సరిగ్గా అదే చారిత్రక బాల్కనీ సాక్షిగా.. లార్డ్స్ మైదానం (Lords Cricket Ground) తన సుదీర్ఘ చరిత్రలోనే తొలిసారిగా మహిళా టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వడానికి సిద్ధమైంది. దీంతో గ్లోబల్ క్రికెట్ ఫోకస్ అంతా మళ్లీ లార్డ్స్ వైపే తిరిగింది.

లండన్‌లోని లార్డ్స్ మైదానానికి ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన స్థానం ఉంది. 1814లో థామస్ లార్డ్ అనే వ్యక్తి చేతుల మీదుగా ఏర్పాటైన ఈ గ్రౌండ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో పవిత్రంగా ‘హోమ్ ఆఫ్ క్రికెట్’గా పిలుచుకుంటారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించే నిబంధనలను రూపొందించిన మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది.

ఆనర్స్ బోర్డు: లార్డ్స్ లోని ఆనర్స్ బోర్డు ప్రతి క్రికెటర్‌కు ప్రత్యేకమే. టెస్టులో సెంచరీ చేసినా, ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసినా, ఒక టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్లు సాధించినా.. ఆటగాడి పేరు ఈ బోర్డుపై శాశ్వతంగా నమోదవుతుంది. చాలా మంది క్రికెటర్లు దీనినే తమ కెరీర్లో అత్యంత గొప్ప గుర్తింపుగా భావిస్తారు. మైదానంలోకి వెళ్లే ముందు ఆటగాళ్లు లాంగ్ రూమ్ గుండా నడవాలి. చారిత్రక చిత్రాలు, సంప్రదాయ వాతావరణంతో ఈ హాల్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.

లార్డ్స్ స్లోప్: ఈ మైదానానికి మరో ప్రత్యేకత ‘లార్డ్స్ స్లోప్’. మైదానం పూర్తిగా సమంగా ఉండదు. ఒక వైపు నుంచి మరోవైపు వరకు స్వల్ప వాలు ఉంటుంది. దీంతో బౌలర్లకు, బ్యాటర్లకు పరిస్థితులు మారుతాయి. అందుకే ఇక్కడ ఆడటం మిగతా మైదానాల కంటే భిన్నమైన అనుభవంగా భావిస్తారు.

భారత్ తో విడదీయరాని బంధం

లార్డ్స్ మైదానానికి, భారత్ క్రికెట్కు విడదీయరాని బంధం ఉంది. వెస్టిండీస్ లాంటి పరాక్రమ జట్టును ఓడించి, కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా తన తొలి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది ఈ గడ్డపైనే. ఆ విజయమే భారత్లో క్రికెట్‌ను ఒక మతంగా మార్చేసింది.

దాదా సింహగర్జన (2002): నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించిన అనంతరం.. టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో నిలబడి తన జెర్సీని విప్పి గాల్లో ఊపుతూ బ్రిటీషర్లకు ఇచ్చిన రిటన్ గిఫ్ట్ ప్రతి భారతీయుడి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మధుర జ్ఞాపకం.

మరెన్నో మైలురాళ్లు: భారత క్రికెట్ త్రిమూర్తులు సచిన్, ద్రవిడ్, గంగూలీ కెరీర్లో లార్డ్స్ ఒక ముఖ్య భూమిక పోషించింది. 1996లోనే ఇదే గడ్డపై గంగూలీ టెస్ట్ అరంగేట్రంలోనే చారిత్రక సెంచరీ (131) బాదగా, ద్రవిడ్ 95 పరుగులతో ‘ది వాల్’గా ఎంట్రీ ఇచ్చాడు. సచిన్ కూడా ఇక్కడ ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు.

అమ్మాయిలూ..అదరగొట్టాలి

ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక గ్రౌండ్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా మహిళల టెస్ట్ మ్యాచ్ జరగలేదు. కానీ ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడింది. లార్డ్స్ క్రికెట్ మైదానం (Lords Cricket Ground)లో జరగబోయే మొట్టమొదటి అంతర్జాతీయ మహిళల టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడే అరుదైన అవకాశం మన ‘ఉమెన్ ఇన్ బ్లూ’ (భారత మహిళల జట్టు) కే దక్కింది. జులై 10 నుంచి జులై 13 వరకు ఈ చారిత్రక పోరు జరగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని మన అమ్మాయిలు లార్డ్స్ సంప్రదాయ ‘లాంగ్ రూమ్’ గుండా అడుగుపెట్టబోతున్నారు. పురుషుల పరాక్రమానికి ఏమాత్రం తీసిపోకుండా, తమ శౌర్యపరాక్రమాలతో మన నారీ సేన లార్డ్స్ చరిత్ర పుటల్లో సరికొత్త సింహగర్జన చేయాలని ఆశిద్దాం..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>