కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా కామేపల్లి మండలం గరిడేపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి పిడుగుపాటు (lightning strike) భీభత్సం సృష్టించింది. మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్రామ నివాసి అయిన భట్టు సునీత నివాస గృహంపై పిడుగు పడింది.
ఈ ప్రమాద తీవ్రతకు ఆమె ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. అయితే, పిడుగు పడే సమయంలో కుటుంబ సభ్యులు వేరే గదిలో నిద్రిస్తుండటంతో తృటిలో ఘోర ప్రాణాపాయం తప్పింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అప్రమత్తమైన సునీత కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనల మధ్య ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
కంటిముందే ఇల్లు కూలిపోవడంతో ప్రాణాలు చేతపట్టుకుని ప్రాణభయంతో వణికిపోయారు. ఈ ప్రమాదం కారణంగా సుమారు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉన్నపళంగా ఇల్లు కూలిపోవడంతో తలదాచుకోవడానికి నీడ లేక రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వస్వం కోల్పోయిన తమను ప్రభుత్వం తక్షణమే స్పందించి, తగిన ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని బాధితులు కన్నీటితో వేడుకుంటున్నారు.

