ఆర్ఎఫ్‌సీఎల్ మళ్లీ షట్‌డౌన్.. రైతుల్లో తీవ్ర ఆందోళన!

కలం, కరీంనగర్ బ్యూరో : ఖరీఫ్ సాగు జోరందుకుంటున్న వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల రైతులకు షాకింగ్ న్యూస్ అందుతోంది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం (Ramagundam RFCL) లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో యూరియా ఉత్పత్తి తాత్కాలికంగా పూర్తిగా నిలిచిపోయింది. బుధవారం రాత్రి ప్లాంట్‌లోని అత్యంత కీలకమైన అమ్మోనియం పైప్‌లైన్ లీకేజీ కావడంతో అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు ముందస్తు జాగ్రత్తగా ప్లాంట్‌ను షట్‌డౌన్ చేశారు. ప్లాంట్ పునరుద్ధరణకు మరో పది రోజులు పట్టే చాన్స్ ఉంది. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పీక్ స్టేజీలో ఉండగా యూరియా కొరత తీవ్రం కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

యుద్ధాల ఎఫెక్ట్.. పదే పదే బ్రేకులు!

ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్‌ను సాంకేతిక సమస్యలతో పాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా వెంటాడుతున్నాయి. ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఈ ప్లాంట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. పశ్చిమాసియా దేశాల నుంచి రావాల్సిన నేచురల్ గ్యాస్ సప్లై నిలిచిపోవడంతో ఇప్పటికే ఉత్పత్తి సగానికి పడిపోయింది.కాగా, ఖతార్‌ నుంచి ఆర్‌ఎల్‌ఎన్‌జీని గుజరాత్‌లోని దహేజ టెర్మినల్‌కు నౌకల ద్వారా తీసుకొస్తారు. అక్కడి నుంచి పెట్రోనెట్‌, ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్‌ ద్వారా గ్యాస్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(గెయిల్‌) పైప్‌లైన్‌ నుంచి కాకినాడకు, అక్కడి నుంచి మల్లవరం- భోపాల్‌- బిల్వారా గ్యాస్‌ పైప్‌లైన్‌ ద్వారా ఆర్‌ఎఫ్ సీఎల్‌కు సరఫరా అవుతుంది. అయితే ఖతార్‌లో ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి నిలిపివేయడం, నౌకల ద్వారా సరఫరా ఆగిపోయవడంతో కొద్ది రోజుల క్రితం గ్యాస్‌ కొరత ఏర్పడింది.

మరో ఏడు రాష్ట్రాలకు ఇక్కడ్నించే ..

రామగుండం కంపెనీలో ఉత్పత్తి అయ్యే యూరియాపైనే మరో ఏడు రాష్ట్రాలు ఆధారపడ్డాయి. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ కు ఇక్కడి నుంచి సరఫరా అవుతుంది. ప్లాంల్లో రోజుకు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో రాష్ట్రానికి 11 శాతం సరఫరా చేయాల్సి ఉంది. అయితే తెలంగాణలో గత నెలలో 48 వేల టన్నులు సరఫరా చేసినప్పటికీ ఈనెలలో ఖరీఫ్ సీజన్ మొదలు కాగా.. ప్లాంట్ కేవలం 10 రోజులు కూడా నడవలేదు. ఈ క్రమంలో మరో సారి షట్ డౌన్ కావడంతో ఇంకో పది రోజులు మరమ్మత్తులకు వేచి చూడాల్సి వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

సరఫరా నిలిచిపోతే ముందుగా రాష్ట్రంపైనే

ఆర్ఎఫ్ సీఎల్లో యూరియా ఉత్పత్తి చేయాలంటే 33 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 2 మెట్రిక్ మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం ఉంటుంది. ఇప్పటికే విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే యూరియా రవాణాకు ఆటంకం ఏర్పడింది. ఇక్కడి విద్యుదుత్పాదక కేంద్రం కూడా గ్యాస్‌ ఆధారంగానే నడుస్తోంది. దీనికి తోడు పరిశ్రమలో యూరియా సరఫరా నిలిచిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్పత్తి తగ్గితే దాని ప్రభావం ముందుగా రాష్ట్ర వ్యవసాయరంగంపై పడుతుంది. గత రెండు మూడేళ్లుగా ప్రతిసారి మూడు నుంచి నాలుగు నెలల పాటు సాంకేతిక సమస్యలతో ప్లాంట్ లో యూరియా ఉత్పత్తి నిలిచిపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్లాంట్ పదే పదే మూసివేస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వరి నారుమళ్లు వేసుకుంటుండగా ఎరువులు వేసుకోవడం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో యూరియా కొరత తీవ్రమైతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది.

ఉత్పత్తిపై ప్రభావం?

రామగుండం ఎరువుల కర్మాగారంలో 12.7 లక్షల టన్నుల యూరియా లక్ష్యంగా వార్షిక ఉత్పత్తి జరుగుతోంది. ఏటా ఉత్పత్తయ్యే యూరియాలో 11 శాతం రాష్ట్రానికి కేటాయించబడుతోంది. సాంకేతిక సమస్యల వల్ల యూనిట్ లో ఉత్పత్తి తగ్గితే ముందుగా దాని ప్రభావం రాష్ట్ర రైతులపైనే ఎఫెక్ట్ పడనుంది. ఇప్పటికే ఎల్ నినో ఎఫెక్ట్ తో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా రామగుండం ఎరువుల కర్మాగారం లో యూరియా ఉత్పత్తి నిలిచిపోవడంతో వారి నెత్తిన మరో పిడుగు పడినట్లయింది. 2021 నుంచి రామగుండం ఎరువుల కర్మాగారం ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. గతేడాది 100 రోజులు షట్ డౌన్ చేశారు. ప్లాంట్ నిర్వహణలో నాణ్యత లోపం, అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరమ్మత్తులు జరిగేనా?

ప్లాంట్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు నిపుణులు, ఇంజనీర్లు రంగంలోకి దిగారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించి, ప్లాంట్‌ను తిరిగి పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి కొద్దిరోజులు పట్టే అవకాశం ఉందని అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. “ఇది కేవలం సాంకేతిక కారణాల వల్ల జరిగిన తాత్కాలిక షట్‌డౌన్ మాత్రమే . రైతులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి ఉత్పత్తిని మళ్లీ ప్రారంభిస్తాం.” అంటూ ప్లాంటు అధికారులు చెబుతున్నారు. అయితే మార్కెట్లో ఇప్పటికే తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఈ తాత్కాలిక విరామం వల్ల సరఫరాకు ఎలాంటి పెద్ద ఇబ్బంది కలగబోదని వ్యవసాయ ముఖ్యాధికారులు, ఆర్ఎఫ్సీఎల్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే
అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొరత రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>