కలం, ఖమ్మం బ్యూరో: అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఎరువుల యాప్ ప్రవేశ పెట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమాత్రం సహకరించడం లేదని వాపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం శక్తినంతటినీ కూడగట్టుకుని వ్యవసాయ రంగాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తోందని స్పష్టం చేశారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి..
ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా గురువారం నిర్వహించిన ‘మెగా రైతు మేళా’లో మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి కావాల్సిన ఎరువులను సాధించుకుంటున్నామని వివరించారు.
యూరియాను కొందరు బ్లాక్ మార్కెట్ చేస్తూ, ఇతర పరిశ్రమలకు తరలిస్తున్నారని చెప్పుకొచ్చారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఎరువుల యాప్ ద్వారా పంపిణీ చేస్తున్నామని వివరించారు.
యాంత్రీకరణకు రూ.1000 కోట్లు..
వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి పెద్దపీట వేస్తూ, అందుకు రూ.1000 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. రైతులకు వాతావరణ సమాచారం సకాలంలో అందించేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చామన్నారు.
దీని ఆధారంగా వర్ష సూచనను గమనించి రైతులు తమ సాగు పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకోవచ్చని సూచించారు. మార్కెట్లో అధిక డిమాండ్ ఉండి, ఎక్కువ దిగుబడి, ఆదాయాన్ని తెచ్చిపెట్టే వరి విత్తనాల పంపిణీకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
త్వరలోనే అక్కడ పామాయిల్ ఫ్యాక్టరీలు..
ప్రపంచంలో ఏ ఆధునిక సాంకేతికత ఉన్నా, ఏ మంచి వంగడాలు ఉన్నా అవి తెలంగాణ రైతు ముంగిటకు రావాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని తుమ్మల స్పష్టం చేశారు. అందులో భాగంగానే రైతులకు అధిక ఆదాయాన్ని చేకూర్చే పామాయిల్ ఫ్యాక్టరీలను కొణిజర్ల, కల్లూరు ప్రాంతాల్లో త్వరలోనే ప్రారంభించబోతున్నామని ప్రకటించారు.
చారిత్రాత్మక రైతు మహాసభ..
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంతటి చారిత్రాత్మక రైతు మహాసభ జరగడం గర్వకారణమని మంత్రి తుమ్మల అభివర్ణించారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన కలెక్టర్, సీపీ, అధికార యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ మెగా రైతు మేళా ద్వారా తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు రాష్ట్ర రైతాంగానికి ఎంతో మేలు చేకూరుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

