కలం, వెబ్ డెస్క్ : ప్రజల ఆస్తిపై ప్రజలకే పూర్తి హక్కు ఉండాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత పాలకుల అరాచక నిర్ణయాల వల్ల రాష్ట్రంలోని భూయజమానులు, సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశామని ప్రకటించారు.
గతంలో భూమి పన్నును రద్దు చేసి రైతులకు అండగా నిలిచిన ఘనత స్వర్గీయ నందమూరి తారకరామారావుదేనని సీఎం పేర్కొన్నారు. అదే బాటలో నడుస్తూ తమ ప్రభుత్వం కూడా భూములకు పూర్తి భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి ఆస్తికి చట్టబద్ధమైన రక్షణ లభిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

