కలం, భువనగిరి: భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై స్పందించారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు జరుగుతున్న ప్రచారాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యే మందుల సామేల్‌కు (Mandula Samuel) కానీ, ఎంపీగా తనకు కానీ ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేకపోయినా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కున చేర్చుకుని తమను గెలిపించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యే మందుల సామేల్‌కు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.
తుంగతుర్తి (Thungathurthi) నియోజకవర్గంలో మండల అధ్యక్ష పదవికి, పీఏసీఎస్ చైర్మన్ పదవికి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవులకు తాను ఎవరినీ వ్యక్తిగతంగా ప్రమోట్ చేయలేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) తెలిపారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు వారు ఎవరిని కోరుకుంటే వారికే పదవులు ఇద్దామని ఎమ్మెల్యే మందుల సామేల్‌కు ముందే చెప్పానని, ఆయన తీసుకునే ఏ నిర్ణయానికి కూడా తాను వ్యతిరేకం కాదని అన్నారు. అయితే తాను విదేశాల్లో ఉన్న సమయంలో మండల అధ్యక్షులను ప్రకటించారని, దీనిపై నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు తనకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
ఈ విజ్ఞప్తుల నేపథ్యంలోనే తాను ఈ అంశాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లానని, ఆ తర్వాతే సదరు ప్రకటనను నిలిపివేయాలని కోరినట్లు వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వంత మండలం తిరుమలగిరితో పాటు, తన స్వంత మండలం శాలిగౌరారం కూడా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ సమస్యపై సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల డీసీసీ అధ్యక్షులు, పార్లమెంట్ అబ్జర్వర్లతో మాట్లాడి త్వరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. మండల స్థాయిలో కార్యకర్తలు ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తే వారికే పదవుల్లో అవకాశం ఇద్దామని స్పష్టం చేశారు.
ఇలా చేస్తే చులకనవుతాం..
పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు రోడ్డు ఎక్కి కొట్టుకుంటే ప్రజల్లో చులకన అవుతామని, కాబట్టి తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ అంతా సమన్వయం పాటించాలని హితవు పలికారు. కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు మనకు పదవులు వచ్చాయని, మన గెలుపు కోసం రాత్రింబగళ్లు పని చేసిన క్యాడర్‌ను ఇప్పుడు మనం సమానంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం చేయాలనే ఆలోచన తనకు లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు తమపై ఎంతో నమ్మకంతో గెలిపించారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన తెలిపారు.
Read Also : అమెరికా వీసా రూల్స్ చేంజ్: ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
Read Also: డిజిటల్ వారసులు

