కలం, తెలంగాణ బ్యూరో: ఫీజు చెల్లిస్తే కానీ.. టీసీ, సర్టిఫికెట్లు ఇవ్వబోమని హెచ్చరిస్తున్నాయి ప్రైవేట్ కాలేజీలు. అడ్మిషన్ల సమయం ముగుస్తుండటంతో విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) రాకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని చెప్తున్నాయి విద్యార్థి సంఘాలు. ఫీజులు రిలీజ్ చేయకపోతే మిలియన్ మార్చ్ తప్పదని తేల్చిచెప్తున్నాయి. విడతల వారీగా విడుదల చేస్తున్నామని ప్రభుత్వం అంటున్నది. అసలు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత పెండింగ్ ఉన్నది? ఎప్పటి నుంచి ఉన్నది?
ఫీజు రీఇంబర్స్ మెంట్ బకాయిలపై తలోమాట వినిపిస్తున్నది. విద్యార్థి సంఘాలు రూ. రూ. 11 వేల కోట్లు అని అంటున్నాయి. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు రూ. 19 వేల కోట్లు అంటున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు రూ. 9 వేల కోట్లు అని చెప్తున్నాయి. ప్రభుత్వం మాత్రం రూ. 1,650 కోట్లు అని హైకోర్టు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నట్లు తెలిసింది. అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి సమాచారాన్ని వెల్లడించకపోవడంతో ఎంత మంది విద్యార్థులకు ఈ స్కీమ్ కింద సాయం అందాలి, ఇప్పటివరకు చెల్లించినదెంత, ఇంకా చెల్లించాల్సింది ఎంత.. ఇలాంటివాటిపై స్పష్టత లేకుండాపోయింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుత ప్రభుత్వంలోనూ అదే కొనసాగుతున్నది. విద్యా రంగంపై ప్రభుత్వం వెచ్చిస్తున్నదాన్ని ఖర్చుగా చూడడంలేదని, భవిష్యత్తుకు పెట్టుబడిగా చూస్తున్నామని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కానీ, చదువుకు ఆటంకంగా మారిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలో మాత్రం ఎటూ తేల్చడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి ఒకదాని తర్వాత ఒకటిగా ఆర్థిక చిక్కులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ఖజానా పరిస్థితి దయనీయంగా మారడంతో సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ఇబ్బందికరంగా తయారైంది. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఫీజు రీయింబర్స్ మెంట్ అంశం తీవ్రమవుతున్నది. ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం హెచ్చరికలు, నిబంధనల్లో మార్పులతో ఉత్తర్వుల జారీ, సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన కొన్ని కళాశాలల యాజమాన్యాలు, న్యాయస్థానం ఆంక్షలు.. ఇవన్నీ తల్లిదండ్రులను కన్ఫ్యూజన్లోకి నెట్టాయి.
కొత్త కోర్సుల్లో చేరుతున్న విద్యార్థులకు ఫీజుల చెల్లింపు సంకటంగా మారింది. ఇంకోవైపు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వీటికితోడు విద్యార్థి సంఘాల నిరసనలు, విద్యా సంస్థల బంద్, బీసీ సంఘాల జేఏసీ ఈ నెల 20 ‘మిలియన్ మార్చ్’ నిర్వహిస్తామన్న హెచ్చరిక.. ఈ నేపథ్యంలో విద్యా శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరుగుతున్నది.
ప్రభుత్వ బకాయిలు రూ. 6,878 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ. 6,878.63 కోట్లు. ఇందులో సగానికి పైగా బీసీ విద్యార్థులవే. ఆ తర్వాతి స్థానంలో మైనారిటీ, ఎస్సీ విద్యార్థులకు చెల్లించాల్సింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి దాదాపు రూ. 3,182.77 కోట్లు (2019-20 నుంచి 2024-25 వరకు) పెండింగ్‌లో ఉండగా.. ఇప్పుడు అది రెట్టింపయింది. ఈ రెండున్నరేండ్లలో ప్రభుత్వం చెల్లించింది రూ. 2,050 కోట్లు (2026 మార్చి చివరి నాటికి).
ప్రభుత్వం బడ్జెట్లో చేసిన కేటాయింపుల మేరకు బీసీ సంక్షేమ శాఖకు నిధులు ఒక మేరకు విడుదలైనా ఖర్చు మాత్రం చాలా తక్కువగా ఉన్నది. ఉదాహరణకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమ శాఖకు రూ. 9,506 కోట్లు కేటాయిస్తే.. రూ. 6,211 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో ఖర్చయింది కేవలం రూ. 1,932 కోట్లే. ఆ తర్వాతి సంవత్సరం (2025-26) రూ. 11,607 కోట్ల కేటాయింపుల్లో రూ. 7,214 కోట్లు విడుదలైతే ఖర్చయింది రూ. 3,073 కోట్లే.
సంక్షేమానికి కాంగ్రెస్ చిరునామా అంటూనే..!
ప్రజా ప్రభుత్వంలో సంక్షేమానికి తొలి ప్రాధాన్యం అంటూ ముఖ్యమంత్రి మొదలు మంత్రులంతా చెప్తున్నా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మాత్రం అది విమర్శలకు దారితీసింది. ఈ అంశం రాజకీయ, న్యాయ, సామాజిక చర్చకు కేంద్రంగా మారింది. వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని విద్యార్థి సంఘాలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం దశలవారీగా చెల్లింపులు చేస్తున్నామంటున్నది.
ఈ వివాదం చివరికి హైకోర్టుకు చేరింది. కొత్త నిబంధనలతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వివాదాస్పదమైంది. హైకోర్టు దాని అమలును నిలిపేసింది. ఫండ్స్ రిలీజ్‌పై రోడ్ మ్యాప్ ఇవ్వాలని తేల్చిచెప్పింది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ కీలకమైన సంక్షేమ పథకమే అయినా ప్రభుత్వ చెల్లింపుల్లో జాప్యం సమస్యలకు కారణమవుతున్నది. ప్రైవేటు కాలేజీలు పిల్లలపై ఒత్తిడి చేస్తుండడంతో ఆ భారం తల్లిదండ్రులపై పడింది. కొత్త అడ్మిషన్లకు సర్టిఫికెట్లను సమర్పించడం సంక్లిష్టంగా మారింది.
ఫీజు రీయింబర్స్ మెంట్ లెక్కలివే
మొత్తం బకాయిలు : రూ. 6,878.63 కోట్లు ఉండగా.. ఇందులో బీసీలకు : రూ. 3,482.11 కోట్లు, మైనారిటీలకు : రూ. 1,179.38 కోట్లు, ఎస్సీలకు : రూ. 1,171.27 కోట్లు, ఈబీసీలకు : రూ. 580.68 కోట్లు, దివ్యాంగులకు : రూ. 42 లక్షలు.
ప్రభుత్వం రెండున్నరేండ్లలో చెల్లించింది : రూ. 2,050.01 కోట్లు
బీసీలకు చెల్లించింది : రూ. 662.63 కోట్లు
లబ్ధిపొందిన బీసీ విద్యార్థులు: 6,16,361 మంది
ఈ ఏడాది మార్చి నాటికి బీసీలకు చెల్లించాల్సింది : రూ. 1,359.94 కోట్లు

