కలం, తెలంగాణ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ కేవలం సాఫ్ట్వేర్, ఐటీ రంగాలకే పరిమితం కాదని.. గ్రామీణ రైతుల జీవితాలలోనూ కీలక మార్పులు తీసుకురాగలదని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ (Telangana) ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సాగు బాగు’(Saagu Baagu) కార్యక్రమం వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగానికి ఆదర్శంగా నిలుస్తోందని అంతర్జాతీయ స్థాయి నివేదిక ప్రశంసించింది.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ప్రోసస్ కలిసి విడుదల చేసిన ‘ఏఐ ఫర్ ఆల్’ నివేదికలో తెలంగాణ సాగు బాగు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. వ్యవసాయంలో ఏఐ సాంకేతికతను ఉపయోగించి రైతుల ఖర్చులు తగ్గించడం, దిగుబడులు పెంచడం వంటి అంశాలలో తెలంగాణ నమూనా దేశానికి ఆదర్శంగా ఉందని పేర్కొంది. భారత్‌లో ఏఐ వినియోగం కేవలం సామర్థ్యాన్ని పెంచే సాధనంగా కాకుండా.. సేవలు అందని ప్రజలకు అవకాశాలు కల్పించే శక్తిగా మారాలని నివేదిక సూచించింది. ఈ దిశగా తెలంగాణలో అమలవుతున్న సాగు బాగు కార్యక్రమం సరైన ఉదాహరణగా నిలుస్తోందని అభిప్రాయపడింది.
మట్టి నమూనాల నుంచి ఏఐ సలహాలు
సాగు బాగు కార్యక్రమంలో భాగంగా రైతులు తమ పొలాల్లోని మట్టి నమూనాలను సేకరించి శాస్త్రీయంగా పరీక్షిస్తారు. ఆ వివరాలను ఏఐ వ్యవస్థ విశ్లేషించి రైతులకు ప్రత్యేక సూచనలు అందిస్తుంది. ఏ పంట సాగు చేయాలి? ఎంత మొత్తంలో ఎరువులు వేయాలి? ఎప్పుడు నీరు అందించాలి? ఏ పోషకాలు అవసరం? పురుగుల సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? వంటి అంశాలపై ఏఐ ఆధారిత వ్యక్తిగత సలహాలు అందుతున్నాయని నివేదిక తెలిపింది. ప్రతి పొలానికి ఒకే విధమైన సూచనలు కాకుండా.. నేల పరిస్థితులు, పంట అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సిఫారసులు చేయడం ఈ విధానంలోని ప్రత్యేకతగా పేర్కొంది.
రైతుల ఖర్చులు తగ్గింపు
ఏఐ ఆధారిత వ్యవసాయ సలహాలతో రైతులు అవసరానికి మించి ఎరువులు, పురుగుమందులు వినియోగించాల్సిన పరిస్థితి తగ్గిందని నివేదిక తెలిపింది. దీంతో వ్యవసాయ ఇన్పుట్ ఖర్చులు సుమారు 9 శాతం వరకు తగ్గాయని, ఎకరాకు ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొంది.ఇదే తెలంగాణ వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగం సాధించిన విజయగాథగా నివేదిక అభివర్ణించింది.
ఆరోగ్య రంగంలోనూ ఏఐకు అవకాశాలు
వ్యవసాయంతో పాటు ఆరోగ్య రంగంలోనూ ఏఐ వినియోగానికి భారీ అవకాశాలు ఉన్నాయని నివేదిక సూచించింది. హైదరాబాద్‌లో ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ.. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో నిపుణులైన వైద్యుల కొరత కొనసాగుతోందని గుర్తు చేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏఐ ఆధారిత డయాగ్నస్టిక్ వ్యవస్థలు, టెలీమెడిసిన్ సేవలు, డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్‌లను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. వ్యవసాయం నుంచి ఆరోగ్యం వరకు.. ప్రజలకు నేరుగా ఉపయోగపడే విధంగా ఏఐ టెక్నాలజీని వినియోగించడంలో తెలంగాణ ముందంజలో ఉందనే అభిప్రాయాన్ని ఈ నివేదిక వెల్లడించింది.

